రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్ష నిర్వహించారు.
సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో రైలు కార్యకలాపాల నిర్వహణ, భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ , గుంటూరు మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
సెప్టెంబరు, 2024 నెలలో అధికారులు మరియు సూపర్వైజర్లు నిర్వహించిన సుమారు 1200 భద్రతా తనిఖీలకు సంబందించిన వివరాలపై సమీక్షించారు. తనిఖీల సమయంలో ఏవైనా లోపాలు మరియు రైల్వే ఆస్తుల నిర్వహణపై ఏదేని లోటుపాట్ల ను గుర్తించినట్లైతే వాటిని వీలైనంత త్వరగా సరిదిద్దాలని ఆయన ఆదేశించారు. ప్రతినెలా అధికారులు/సూపర్వైజర్ల క్షేత్ర స్థాయి భద్రతా తనిఖీలను మరింత పెంచాలని ఆదేశించారు. అన్ని భద్రతా సంబంధిత రిజిస్టర్లు మరియు రికార్డులను క్షేత్ర స్థాయి సిబ్బంది విధివిధానాల ప్రకారం నిర్వహించాలని మరియు రైళ్లు సజావుగా నడపడానికి సురక్షితమైన పని పద్ధతులను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన తెలియ జేశారు. సెప్టెంబరు, 2024 నెలలో చేపట్టిన సేఫ్టీ డ్రైవ్ల పైన కూడా ఆయన సమీక్షించారు. భద్రతకు సంబంధించిన సిగ్నలింగ్, ఇంజినీరింగ్ పరికరాలు మరియు స్టేషన్ ఆస్తులు ,వాటి లభ్యత మరియు పనితీరుపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిబ్బంది పనివేళలు మెరుగుపడడాన్ని జనరల్ మేనేజర్ అభినందించారు మరియు సిబ్బందికి సరైన విశ్రాంతి ఉండేలా అదే విధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
