రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంటల దిగుబడులు పెరిగేలా రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడమే లక్ష్యంగా “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాచెప్పారు. గురువారం కొత్తపట్నం మండలం మోటుమాలలో నిర్వహించిన “పొలం పిలుస్తుంది” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్తాయిలో పరిస్థితిని పరిశీలించేలా అధికార యంత్రాంగం రైతుల వద్దకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. వ్యవసాయంలో సుస్థిరాభివృద్ధి సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ దిశగా రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి వినూత్న సాగు విధానాలను చేరువ చేస్తున్నట్లు చెప్పారు. మరో వైపు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులు కేవలం వ్యవసాయంపైనే కాకుండా దాని అనుబంధ రంగాలలో కూడా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చూస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సేంద్రీయ వ్యవసాయానికి కొత్తపట్నాన్ని మోడల్ మండలంగా ఎంపిక చేశామన్నారు. రైతులకు అవసరమైన రుణాలు కూడా సత్వరమే మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా మత్స్య శాఖ శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఏ.పి.ఎం.ఐ.పి. పి.డి. పి.వి.రమణ, ఎల్.డి.ఎం. డి.రమేష్ , ఏ.పి.సి.ఎన్.ఎఫ్. డి.పి.ఎం. సుభాషిణి, ఆత్మ, పశుసంవర్థక శాఖల స్థానిక అధికారులు మాట్లాడుతూ తమ శాఖల వారీగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం భూసారం పెరిగేలా స్థానికంగా జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని, పంటలను కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలించారు. సేంద్రీయ కూరగాయల వినియోగం పెరిగేలా ప్రత్యేక విక్రయ కేంద్రాలపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ. సుబ్బారెడ్డి, తహశీల్దార్ మధుసూదన్, ఇతర అధికారులు ఉన్నారు.

