- చీమకుర్తి నుంచి ఒంగోలు వరకు భారీ ర్యాలీ ఏర్పాట్లు
చిన్న వయసులోనే రెండుసార్లుఎమ్మెల్యేగా గెలిచి జడ్పీ చైర్మన్ గా
ఉన్న తన తల్లికి బాసటగా నిలుస్తూ జిల్లా రాజకీయాల్లో తనకంటూ
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి
సన్నిహితునిగా మెలుగుతూ నేడు వైయస్ఆర్ సీపీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని తండ్రికి తగ్గ కుమారునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో
అందరిచేత శభాష్ అనిపించుకుంటూ అందరితో కలిసిపోతూ రాజకీయ పార్టీలకు అతీతంగా స్నేహశీలిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమిగాలి విస్తృతంగా వీచింది. దీంతో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను వైసీపీకి చెందిన అభ్యర్ధులు కేవలం 11 మంది గెలిచారు. వీరిలో దర్శి నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకరు.
2019లో దర్శి నుంచి పోటీ చేయమని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలతో వెనుకడుగు వేశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కి బూచేపల్లి కుటుంబానికి ఉన్న సత్సంబంధాలతో 2024లో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ని పక్కనపెట్టి డాక్టర్ బూచేపల్లికి
టిక్కెట్టు ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూచేపల్లి వెంకాయమ్మను జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. వైసీపీకి ఎప్పుడూ నమ్మిన బంటుగా ఉన్న డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి నేడు ఆ పార్టీ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. మూడు దశాబ్ధాల పాటు చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసినవిషయం విదితమే. మొదటిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం వైయస్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేసిన బాలినేని వైయస్ మరణాంతరం జగన్ వెంట నడిచారు. జగన్ ప్రభుత్వంలో బాలినేని మంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ పట్ల తాను అసంతృప్తికి లోనై ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే సత్తా ఉన్న నాయకుడు
డాక్టర్ బూచేపల్లి అని గుర్తించిన ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ బూచేపల్లికి అవకాశం కల్పించారు. బాలినేని రాజీనామా చేసిన అనంతరం జిల్లాలోని 8 నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేసి బూచేపల్లిని జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేస్తున్నాను. మీరందరూ బూచేపల్లి అడుగు జాడల్లో నడుచుకోవాలి. జిల్లాలో
పార్టీని మరింత పటిష్టం చేయాలి అని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. చీమకుర్తి నుంచి వేలాది మందితో ర్యాలీగా ఒంగోలు వచ్చి ఒంగోలులోని కలెక్టరేట్
వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం బైపాస్ సమీపంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన పలువు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు, జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు.


