దసరా పండుగను పురస్కరించుకొని నగరంలోని దేవాలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలను సందర్శించి, భక్తి పారవశ్యంతో దేవతామూర్తుల దివ్య దర్శనం పొందుచున్నారు.
నగరంలోని స్థానిక అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో జరుగుచున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిజరుపంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిగా భక్తులను అనుగ్రహించారు. ఉదయం శ్రీ సూక్త సహితంగా కొబ్బరి నీటితో శ్రీవాసవిదేవిని అభిషేకించారు. ఉభయ దాతలచే ఆలయ అర్చకులు శర్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి సహస్ర కుంకుమార్చన నిర్వహింపచేశారు. తదుపరి సాయంత్రం శ్రీ వాసవి కోలాట భజన మండలి వారిచే కోలాటం, గుడి ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మూలమూర్తి అలంకార దాతలుగా నల్లమల్లి బలరామ గిరీష్ దంపతులు, వేదికపై అమ్మవారి అలంకార కైంకర్యవర్యులుగా ఊటుకూరు సుందర రామానుజం దంపతులు వ్యవహరించారు.


