ఈనెల 10వ తేదీ నాటికి జిల్లాలోని కరువు మండలాల ప్రతిపాదనలను పంపించాల్సివుందని, అందుకనుగుణంగా జిల్లాకు సంబంధించిన కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో రెవెన్యూ, వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులు, జలవనరులు, భూగర్భ జల శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమావేశమై జిల్లాలోని కరువు మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కరువు మండలాల నిర్ధారణ కొరకు ప్రభుత్వం నిర్దేశించిన 6 ఇండికేటర్స్ ప్రకారం కరువు మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత శాఖల అధికారులు సిద్దం చేయాలన్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు, ఎంత తక్కువ వర్షపాతం నమోదైన వివరాలు, వ్యవసాయపరంగా గతంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని విషయాన్ని, జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా ఎంత విస్తీర్ణం భూమికి నీటిని అందిస్తున్నారనే విషయాల ఆధారంగా కరువు మండలాల ప్రతిపాదనలు సమర్పించాల్సి వుందని, అందుకనుగుణంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, సిపిఓ వేంకటేశ్వర రావు, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఐసిడిఎస్ పిడి మాధురి, ఎపిఎంఐపి పిడి రమణ, పశు సంవర్థక శాఖ జేడి డా. బేబి రాణి, గ్రౌండ్ వాటర్ డిడి విద్యా సాగర్, జిల్లా హార్టికల్చర్ అధికారి గోపి చంద్, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
