గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడంతోపాటు తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యమని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్ అర్జీలతోపాటు కోర్టు కేసుల పెండింగ్ పిటిషన్ల పైనా ఆయన సమీక్షించారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించి ఎండార్స్మెంట్ ఇవ్వడంపై ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గ్రామ సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లతో తాను జూమ్ మీటింగ్ నిర్వహిస్తానని చెప్పారు. అదనపు సి.సి.ఎల్.ఏ. ను కూడా ఈ సమావేశంలో భాగస్వామిని చేయడం ద్వారా ల్యాండ్, ఇతర సేవలు అందించడంపై క్షేత్రస్థాయి సిబ్బందికి విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. కోర్టులో వివిధ కేసులకు సంబంధించిని రిట్, రివ్యూ, తదితర పిటిషన్లను సకాలంలో వేయాలని సిబ్బందికి జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
సమావేశంలో డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, కోర్టు కేసుల నోడల్ ఆఫీసర్ లోకేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

