జిల్లా స్థాయిలో పనిచేసే అధికారికి సైతం రెవిన్యూ శాఖలో అమ్యామ్యాలు (లంచాలు) సమర్పించుకోక తప్పనిపరిస్థితి ఏర్పడినది. లంచాలు ఇచ్చినా సరే ….నెలలు గడుస్తున్నా పనులు కాక పోవటం, అధికారులు బదిలీ సైతం కావటంతో తప్పనిసరి పరిస్థితులలో ఆ అధికారి సోమవారం జరిగిన మీకోసం ( గ్రీవెన్స్ సెల్) లో తహసీల్దార్ నాగలక్ష్మి కి తన సమస్యను తీర్చాలని విన్నవించారు. వివరాలలోనికి వెలితే… జిల్లా పంచాయితీ కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేసే గాదంశెట్టి ప్రభాకర్ కు తాళ్లూరు మండలం సోమవరప్పాడు రెవిన్యూ పరధిలో సర్వే నంబర్ 228లో 1.50 ఎకరాలు ఉన్నది. ఈ పొలంను ఆన్ లైన్ చేయు విషయమై జనవరిలో తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంను సంప్రదించి కావలసిని దరఖాస్తును సమర్పించాడు. నెలల తరబడి తిరిగిన తర్వాత ప్రతి రోజు ఒంగోలు కార్యాలయం నుండి తాళ్లూరు రావాలంటే ఇబ్బందిగా ఉన్నందున కార్యాలయంలో పనిచేసే ఒక అధికారికి రూ.10వేలు నగదు ఇచ్చి త్వరగా పనిజరిగేలా చూడాలని, ప్రతి రోజు తాను కార్యాలయం పనులు వదిలి రావాలంటే ఇబ్బందిగా ఉన్న విషయాన్ని తెలిపారు. దీంతో అందుకు ఒప్పుకున్న సదరు అధికారి ఏడు నెలలు గడిచినా సరే పని జరగక లేదు. పైగా అధికారులు బదిలీలపై వెళ్లారు. దీంతో మరలా పని మొదటికి రావటంతో తనకు న్యాయం చేసి తన ఆన్ లైన్ పనిపూర్తి చెయ్యాలని సోమవారం తహసీల్దారు విన్నవించారు. విషయం తెలిసిన ప్రజలు అధికారులకు సైతం మరో శాఖ అధికారులతో లంచాల బాధలు తప్పటం లేదంటూ చర్చించుకుంటున్నారు.
