గ్రామసభలలో గుర్తించిన పనులన్నింటినీ వచ్చేవారం ‘ పల్లె పండుగ ‘ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
చెప్పారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ.కె.పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రకాశం భవనం నుంచి ఆమె పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టే పనుల వివరాలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. 972 పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చామని, 928 పనులకు సాంకేతిక అనుమతులు లభించాయని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలకు కూడా సాంకేతిక అనుమతులు లభిస్తే వాటినీ చేపడుతామని తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టడానికి ఇసుక పరంగా సమస్యలు లేవని, సిమెంటు సరఫరా సకాలంలో జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తే జనవరి నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యేలా చూస్తామని కలెక్టర్ చెప్పారు. పనులన్నీ చేపట్టడానికి సంబంధిత స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని ఆమె వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, డిపిఓ ఉషారాణి, జెడ్పి సీఈవో చిరంజీవి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.

