నిరంతరం కరవు కాటకాలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశానికి ఏకైక పరిష్కార మార్గమైన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తక్షణమే రూ. 2 వేల కోట్లు వచ్చే బడ్జెట్లో కేటాయించాలని, అలాగే ఈ ప్రాంత ప్రజల పరిపాలన సౌలభ్యం దృష్ట్యా మార్కాపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి ఆశాకిరణమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా పార్టీ కార్యదర్శి ఎం ఎల్ నారాయణ అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన కె. రామకృష్ణ మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి,నిరాదరణకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాధారం తప్ప మరో నీటి ప్రత్యామ్నాయం లేని పశ్చిమ ప్రకాశానికి వెలిగొండ ప్రాజెక్టే శరణ్యమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 28 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ నేటికీ పనులు పూర్తి కాలేదంటే ఈ ప్రాంతం పట్ల పాలకవర్గాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సిపిఐ నాయకులు స్వర్గీయ గుజ్జుల యలమందరెడ్డి, పూల సుబ్బయ్య, సానికొమ్ము కాశిరెడ్డి, రావుల చెంచయ్య తదితర నాయకుల ఆధ్వర్యంలో అనేక దశాబ్దాల పోరాటాల ఫలితమే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి చేరువ అయిందని గుర్తు చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన 11 ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాల్సిన పాలకవర్గాలు వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా మరోవైపు వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొంతమేరకు పురోగమనములో పయనించాయని అన్నారు.
మిగతా ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలు పేరుతో వెదజల్లుతున్న పాలకవర్గాలు కేవలం రూ 2 వేల కోట్ల నిధులు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 32 మండలాలలో 4 లక్షల 32 వేల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి పైగా త్రాగునీరు అందుతుందని అన్నారు. దేశంలోనే అతి తక్కువ నిధులతో ఇన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఎక్కడా లేదని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలని, అలాగే వెనుకబడిన మార్కాపురాన్ని జిల్లా చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం దసరా ఉత్సవాల అనంతరం మంత్రులను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే సంస్థలు పరిష్కారమవుతాయని కావున భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ అనుత్పాదక రంగాలకు లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్న పాలకవర్గాలు ఉత్పాదక రంగానికి కేందం కానున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పాదక రంగాలకు పెద్దపీట వేయాలని ముఖ్యంగా వ్యవసాయ రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనాదిగా ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబాటు తనానికి గురవుతూ వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందకుండా జిల్లా ఏ విధంగా పురోగతి సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. గత పాలకవర్గాలు దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పడమే తప్ప, ఎక్కడ కూడా అమలకు నోచుకోలేదని ఆయన విమర్శించారు. గతంలో పశ్చిమ ప్రకాశంలో పలకల పరిశ్రమ ఈ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున జీవనోపాధి కల్పించేదని, అయితే పాలకవర్గాల నిరాదరణతో ఈ రంగం కూడా పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్. నారాయణ మాట్లాడుతూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రూ. 2,000 కోట్ల నిధులను కేటాయించాలని కోరుతూ ప్రాజెక్టు పరిధిలోని మండల కేంద్రాలలో రెవెన్యూ కార్యాలయాలలో, ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలని, అలాగే నవంబర్ 18 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముంపు గ్రామాల బాధితులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించడం జరిగిందని అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయని, దీంతో ఫ్లోరైడ్ వాటర్ ను అనివార్యంగా ప్రజలు తగాల్సిన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సిపిఎం ఎప్పుడు ముందుంటుందని అన్నారు.
సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టీవీఎన్ స్వామి మాట్లాడుతూ పార్టీలకు, వర్గాలకు రహితంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేయాలని ప్రజలను కోరారు.
పశ్చిమ ప్రకాశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీవనోపాధి కోసం ఈ ప్రాంతం నుండి ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు కూలీలు పెద్ద ఎత్తున వలసలు వెళుతుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కె. సైదా, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి సుదర్శన్, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి, జిల్లా సిపిఐ నాయకులు టి సి హెచ్. చెన్నయ్య కె.వి కృష్ణ గౌడ్, పట్టణ సిపిఐ నాయకులు ఎస్కే కాసిం, సిహెచ్. పెద్దన్న, సిపిఎం పట్టణ కార్యదర్శి డి. సోమయ్య, ఉదయగిరి ఏరియా సిపిఐ నాయకులు మాలకొండ రెడ్డి డాక్టర్ శ్యాం ప్రసాద్, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ రజాక్, సిఐటియు జిల్లా అధ్యక్షులు డీకే ఎం రఫీ, పూల సుబ్బయ్య కాలనీ శాఖ కార్యదర్శి డి అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.








