“అయ్యవారికి చాలు ఐదు వరహాలు – పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు” అంటూ నాడు దసరా పండుగ వచ్చిందంటే సందడి చేసే పిల్లలు, పండుగ సంబరాలు నిర్వహించడానికి పెద్దలు చేసే ప్రయత్నాలు ఎంతో ఉత్సాహంగా ఉండేవి. రకరకాల వేషాలు కట్టి దసరా పగటివేషగాళ్ళు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రతి ఇంటింటికి తిరిగి దసరా మామూలు వసూలు చేసుకోవడం పరిపాటి. నేడు సోషల్ మీడియా పుణ్యమా అని పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు రీల్స్ లో మునిగిపోతున్నారు. సంప్రదాయాలు, ధార్మిక విషయాలు, విధానాలు తెలియక, తెలియ చెప్పేవారు లేక సమాజం రోజురోజుకి అదోగతి పాలవుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతమై ఎవరికివారు నేను, నా భార్య, నా పిల్లలు అన్న స్వార్థంతో చిన్న కుటుంబాలుగా మిగిలిపోతున్నారు. ఆధ్యాత్మిక భావన లేక, ఎవరికివారు తమ చరవాణిలో… తమదైనలోకంలో మునిగిపోతున్నారు. బంధాలు, బంధుత్వాల విలువ శూన్యమై సమాజ పరిస్థితులను అవగాహన చేసుకోలేక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
నాడు దసరా పండుగ వస్తుందంటే ఈ పక్షం రోజులు ఏమి చేయాలి అన్న ఆలోచన ముందుగానే నిర్ణయించుకుని వానికి తగ్గట్టుగా పిల్లలు ఆటలు, పాటలు, మహిళలు పిండి వంటల పనులలో నిమగ్నమై పోయేవారు.
ఆశ్వీజ మాసంలో వచ్చే దసరా పండుగ ప్రధానంగా శక్తి ఆరాధనగా ఘనంగా జరుపుకుంటారు. ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాఢ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు శరన్నవరాత్రులుగా, పదవరోజు దశమి రోజును విజయదశమిగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శరదృతువు లో పండుగ జరుపుకోవడంతో శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందినది. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రి తొలి మూడు రోజులు పార్వతీదేవి, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులు సరస్వతి దేవి ఆరాధనగా పండుగ జరుపుకోవడం, పదవ రోజు దుష్టులపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిగా… దసరా పండుగ జరుపుకొంటున్నాము.
దసరా శరన్నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి రోజుకొక అలంకారంతో పూజించడం, ఆ అధిష్టాన దేవత శక్తి ఆవాహనకై స్తోత్రాలు పఠించడం, పూజలు నిర్వహించడం, ముఖ్యంగా ఈ పండుగ రాత్రి సమయంలో సామూహికంగా బంధుమిత్రులతో వేడుకగా జరుపుకోవడం, మరింత శోభను కలిగించడానికి ప్రతి ఇంట బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం, బొమ్మల కొలువులో విశ్వ రూప దర్శనం, సూర్యచంద్రాదులు, నవగ్రహాలు, దశావతారాలు ఇలా ఆధ్యాత్మిక, పురాణ ఇతిహాస సంబంధమైన బొమ్మలను అందంగా అలంకరించడం, భక్తి భావనలతో పాటుగా సామాజిక పరివర్తన కలిగించడానికి బొమ్మల కొలువు ఉపయుక్తంగా ఉండేవి.
ద్వాపర యుగంలో విరాట రాజు కొలువులో అజ్ఞాతంలో ఉన్న పాండవులు శమీ వృక్షంపై దాచిపెట్టిన ఆయుధాలను తీసుకొని ఉత్తర గోగ్రహణంలో కౌరవులతో జరిపిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఒక పౌరాణిక గాధ.
దుర్గా దేవి మహిషుడనే రక్కసునితో 9 దినములు యుద్ధము చేసి వధించి విజయం సాధించిన దానికి గుర్తుగా పదవరోజు విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవడం మరో పౌరాణిక గాధ. ఈ పండుగ నాడు శమీ వృక్షానికి పూజ చేయడం పాలపిట్టను దర్శించడం మరియు కొన్ని ప్రాంతాలలో దేవతా ఉత్సవ మూర్తులతో పారువేట మహోత్సవం జరపడం చేస్తున్నాము.ృ
కానీ ప్రస్తుతం పండుగలన్నీ సోషల్ మీడియాలో కథలుగా ఉంటున్నాయి. కానీ సామాన్యులకు ఈ పండుగ విశేషాలు తెలియడం లేదు. పండుగను చేసుకునే తీరికలేదు. యువతకు పండుగలపై అవగాహన లేక పండుగ అంటే సెలవు దినం గానే చూస్తున్నారు. పండుగ రోజు ఎలా కాలక్షేపం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. పండుగ ప్రజల మధ్య స్నేహబాంధవ్యాలను పెంచడానికి, అంతేకాకుండా స్వాతంత్ర్య పోరులో అందరూ ఐకమత్యంగా నిలవడానికి ఉపయోగపడ్డాయన్న ధ్యాస లేకుండా పోయింది. ప్రస్తుతం పండుగ సంబరాలు కొద్ది ప్రాంతాలకే పరిమితమవుతున్నది. అయినప్పటికీ దసరా మామూలు అంటూ కొందరు చేస్తున్న బలవంతపు దోపిడీ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఎంతో విశిష్టమైన దసరా పండుగ సంబరాలు దేవాలయాల వద్ద వెలుగుచున్న విద్యుత్ దీపాలలోనే మనకు కనపడుచున్నది.
ప్రతి హిందువు పండుగల విశిష్టతలను తెలుసుకొని ఆచరిస్తూ తరువాత తెలిపే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
వ్యాసకర్త:: రాధ రమణ గుప్తా జంద్యం