దర్శి పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం 57వ చేగువేరా వర్ధంతి సందర్భంగా చేగువేరా చిత్రపటానికి మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఉప్పు నారాయణ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కే వి పిచ్చయ్య మాట్లాడుతూ …. చేగువేరా ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. యావత్ ప్రపంచానికి కొత్త శక్తినిచ్చిన నేత. ప్రపంచంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించాలని యువతకు దిశానిర్దేశం చేసి, ఆచరించి చూపించిన మార్గదర్శి…. వైద్యవిద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి,గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన స్ఫూర్తి తో నేటి యువత పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్ జెస్సీ పాల్, నాయకులు కంట వెంకట్రావు , కళ్యాణ్.మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఉప్పు నారాయణ, సిహెచ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు
