దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వాక్కుల తల్లి సరస్వతి మాత జన్మనక్షత్రం అయిన మూల నక్షత్రం పరమ పవిత్రమైందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని మూలనక్షత్రం విశిష్టతపై ప్రసంగించారు. అమ్మ అనుగ్రహంతో మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ కవి, మూకశంకరులు జగద్వితమయ్యారన్నారు. కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో మంత్రిప్రగడ నరసింహారావు స్మృత్యర్థం, మంత్రి ప్రగడ ఆధ్యాత్మిక పీఠం వారు ఏర్పాటు చేసిన త్రయాత్నిక ఉపన్యాస యఙ్ఞం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుని నిర్వాహకులు మంత్రి ప్రగడ వెంకట సత్య ప్రసాద్, ఈ.ఒ రావెళ్ళ శివంకర్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందచేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య గాయకులు ఐ. మురళీకృష్ణ, సాహితీసుధ ప్రధానకార్యదర్శి పాలూరి శివప్రసాద్, జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు ఎల్చూరి అనంతలక్ష్మి, ఓరుగంటి ప్రసాద్, జానకీరాం, మా మూర్తి తదితరులు పాల్గొన్నారు.

