చెంచుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
యర్రగొండపాలెం మండలం, గింజివారిపల్లె పంచాయతీ, అల్లిపాలెం చెంచు గూడెంలో సార్డ్స్ ఆధ్వర్యంలో 26 లక్షలతో నిర్మించిన బాల ప్రకాశ భవనం ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల ప్రకాశ భవనం పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఈ ప్రాంత చెంచుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు సార్డ్స్ సంస్థ కృషి అభినందనీయమన్నారు.
చెంచుల జీవన ప్రమాణాలు అభివృద్ది పరచడానికి, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జన్ మన్ కార్యక్రమం కింద అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుచున్నదన్నారు. అల్లిపాలెం చెంచు గూడెం లో పర్యటించడం జరిగిందని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరడం జరిగిందని, అలాగే విద్యార్థులు చదువుకునేందుకు వసతి గృహం ను ఏర్పాటు చేయాలని గూడెం ప్రజలు కోరడం జరిగిందని తెలిపారు. గూడెం ప్రజలు తెలిపిన సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
గంజివారి పల్లె సర్పంచ్ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ… సార్డ్స్ సంస్థ 26 లక్షలతో బాల ప్రకాశ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అల్లిపాలెం చెంచు గూడెంలో 74 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, వీరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ గూడెంలో వసతి గృహం లేకపోవడంతో పిల్లలు విద్యకు దూరం అగుచున్నారన్నారు. గంజివారిపల్లె నుండి ఈ గూడెంకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వుందని, రోడ్డుకు మరమత్తులు చేపట్టాల్సిన అవసరం వుందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 40 కుటుంబాలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాల్సి ఉందని అలాగే కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను ఏర్పాటుచేయాలని, సార్డ్స్ వారు నిర్మించిన బాల ప్రకాశ భవనంనకు ఉపాధి హామీ పథకం నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించాలని పలు సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అల్లిపురం చెంచుగూడెం వాసులు పలు సమస్యలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొనివస్తూ వినతులను సమర్పించడం జరిగింది.
తొలుత జిల్లా కలెక్టర్, కుడుముల బయన్న ఇంటిని సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మాకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని, అలాగే మా పిల్లలు చదువుకునేలా వసతి గృహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరడం జరిగింది.
అనంతరం జిల్లా కలెక్టర్ అంగన్ వాడి కేంద్రాన్ని, న్యూట్రి గార్డెన్ ను పరిశీలించడం జరిగింది. మొత్తం ఈ కేంద్రంలో 24 మంది పిల్లలు వున్నారని, ఇందులో 15 మంది పిల్లల వివరాలు ఆన్ లైన్ లో వున్నాయని, 9 మందికి ఆధార్ కార్డు లేక వారి వివరాలు ఆన్ లైన్ లో లేవని, అందువలన వీరికి పోష్టికాహారం అందించడంలో ఇబ్బందిగా ఉంటుందని సిడిపిఓ పద్మ, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, వెంటనే ఈ గూడెంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాన్ని పెట్టి ఆధార్ కార్డు లేనివారి వివరాలు నమోదుచేసి ఆధార్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ ను ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఎంపిడిఓ శ్రీనివాస రావు, తహశీల్దార్ బాల కిషోర్, చైల్డ్ బిలీవ్ సంస్థ కంట్రీ డైరెక్టర్ నాన్సీ, సార్డ్స్ పిడి సునీల్ కుమార్, ఐసిడిఎస్ సిడిపిఓ పద్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






