దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రులలో 10వ రోజు మహిషాసుర మర్దినిగా భక్తులను అనుగ్రహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు శర్మ, సాయి అమ్మవారిని శ్రీ సూక్తం సహితంగా చేరుకు రసంతో అభిషేకించారు. ముందుగా ఉబయదాతలచే పూజ నిర్వహింపచేశారు. బండేపల్లి వెంకటేశ్వర శాస్త్రి అమ్మవారిని మహిషాసుర మర్ధనిగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చన, మంత్రపుష్పం సమర్పించారు. సాయంత్రం గుడి ఉత్సవంలో భాగంగా శ్రీ వాసవి కోలాటం భజన మండలి వారిచే కోలాట ప్రదర్శన గుడి ఉత్సవం జరిగినది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
