భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. అత్యవసరమైతే తప్ప రాబోయే నాలుగు రోజులపాటు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను వివరించి, వాటిని అమలు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా మరో నాలుగు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తీరప్రాంత మండలాల అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలని ఆమె అన్నారు.
*గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి*
మరో వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న మహిళలను ఆసుపత్రులలో చేర్పించాలని వైద్యాధికారులకు కలెక్టర్ చెప్పారు. చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు, బాలింతలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను తక్షణమే తుఫాను షెల్టర్ల కేంద్రాలకు, పునరావాస శిబిరాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు రోగులకు అవసరమయ్యే మందులను కూడా అందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పునరావాస శిబిరాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అవసరమైన నిత్యావసరాలు అందించేలా తగిన మోతాదులో సరుకులను సమకూర్చి పెట్టుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.
*మంగళవారం విద్యాసంస్థలకు సెలవు*
భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా జిల్లాలోని అన్ని అంగనవాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్ళు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు ఆమె దిశ నిర్దేశం చేశారు.
*పంట నష్టం నివారించాలి*
భారీ వర్షాల వలన పంటలు నీట మునగకుండా చూడాలని, ఈ విషయంలో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, వారి పడవలను కూడా తీరంలో లంగరు వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తోడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణాలలో ప్రమాదకర స్థితిలో ఉన్న హోర్డింగులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు.
*సిబ్బంది మొత్తం ఫీల్డ్ లోనే…*
పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్తు, రెవెన్యూ, పోలీసు, నీటి పారుదల, వైద్య, గ్రామీణ నీటి సరఫరా శాఖల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సెలవులు రద్దు రద్దు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో నిరంతరం వచ్చే నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. రోడ్లు దెబ్బతిన్నా, కాలువలకు, చెరువులకు ఇతర నీటి వనరులకు గండ్లు పడినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా సత్వరమే పరిస్థితి సరిచేసేలా సన్నద్ధమై ఉండాలని ఆమె చెప్పారు. ప్రమాదకర స్థితిలో ఉన్న వాగులు, కాలువల వైపు ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సిబ్బంది అక్కడ గస్తీ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
*వివిధ స్థాయిలలో కంట్రోల్ రూములు*
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1077 టోల్ ఫ్రీ నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆయా అధికారులను ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ లో పనిచేసే సిబ్బంది అప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, వాటిని సంబంధిత శాఖల అధికారులకు తెలియజేసిన వివరాలతో ప్రతి గంటకు తనకు నివేదిక పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
