భారీ వర్షాల వలన ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేలా సన్నద్ధం – రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయాలు, వాలంటీర్ల శాఖమంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి

భారీ వర్షాల వలన ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయాలు, వాలంటీర్ల శాఖమంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఈ దిశగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అల్పపీడనం నేపధ్యంలో జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున మంగళవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఏ.ఎస్.పి. నాగేశ్వరరావుతో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సత్వర స్పందనపై సంతృప్తి. .

జిల్లాలోని పరిస్థితి, లోతట్టుప్రాంత ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, వర్షాలు కురుస్తున్నప్పటికీ వివిధ సేవలలో అంతరాయం కలుగకుండా తీసుకుంటున్న చర్యలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం వివిధ స్థాయిలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన విధానాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో సత్వరమే స్పందించి ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే మూడు రోజులపాటు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రాణనష్టం జరుగకుండా చూడాలనీ, ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత నివారించాలని స్పష్టం చేశారు. ఇటీవల బదిలీలు జరిగినందున మండల స్థాయి అధికారులు కొత్తగా వచ్చారని, ఈ దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.

అండగా ప్రభుత్వం .. –

ఇప్పటివరకు కురిసిన వర్షాలు జిల్లాలోని వర్షాభావ ప్రాంతాలలో సాగుకు ఉపయోగకరంగా ఉన్నాయని మంత్రి అన్నారు. అయితే ఇప్పటికే సాగు చేసిన పంటలు దెబ్బతిన్నకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటలు దెబ్బతింటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులను ఆదుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. చేపల వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించినందున మత్య్సకారులతోపాటు భృతి కోల్పోయిన వారికి సాయంపైనా ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని మంత్రి తెలిపారు.

వాగుల వద్ద హెచ్చరికలు ..

వర్షాలపై ఆర్.టి.జి.ఎస్. నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాజ్వేలపై నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు వాటిపై రాకపోకలు సాగించకుండా చూడాలని చెప్పారు. మహిళా పోలీసులు, వి.ఆర్.ఏ.లు, స్థానిక సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైకుల ద్వారా ప్రజలకు అప్రమత్తం చేయాలని మంత్రి చెప్పారు. జనావాసాల మధ్య నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సమన్వయం అత్యవసరం..

వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడడంతోపాటు నీరు కలుషితం కాకుండా నాణ్యతా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చురుకుగా చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలన్నారు.

దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ శాఖాపరంగా తీసుకున్న చర్యలను వివరించారు. రెవెన్యూ, ఇతర అధికారులతో క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఏ.ఎస్.పి. నాగేశ్వరరావు చెప్పారు. 700 విద్యుత్ స్థంభాలను అందుబాటులో ఉంచామనీ, 300 మంది కార్మికులను సిద్ధంగా ఉంచామని, జిల్లా కార్యాలయంతోపాటు డివిజన్ స్థాయిల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని ఎ.పి.సి.పి.డి.సి.ఎల్. ఎస్.ఈ. కట్టా వెంకటేశ్వర్లు చెప్పారు. స్నేక్ బైట్ డ్రగ్స్ తోపాటు అవసరమైన అన్ని మందులను ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచామనీ, పునరావాస కేంద్రాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని డి.ఎం.హెచ్.ఓ. సురేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు డివిజన్లోని రూరల్ ఏరియాలో మూడు మండలాల పరిధిలో ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్.డి.ఓ. లక్ష్మీ ప్రసన్న తెలిపారు. పశువులకు అవసరమైన వాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని జిల్లా పశుసంవర్థక అధికారి బేబీరాణి చెప్పారు. కూలిపోయిన చెట్ల వలన రోడ్డు రవాణాకు ఆటంకం కలిగితే తొలగించేందుకు మిషన్లు, జె.సి.బి.లను సిద్ధం చేసినట్లు ఆర్.అండ్.బి. ఎస్.ఈ.దేవానంద్ తెలిపారు. పూర్తస్థాయిలో క్లోరినేషన్ చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నామని ఆర్.డబ్ల్యు.ఎస్. ఈ.ఈ. బాలశంకరరావు చెప్పారు. కాలువలకు గండ్లు పడకుండా పర్యవేక్షిస్తున్నామని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఇసుక బస్తాలను సిద్ధం చేసుకున్నామని ఇరిగేషన్ అధికారులు వివరించారు. ఒంగోలు మున్సిపాలటీ పరిధిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను క్లియర్ చేశామనీ, ఆక్రమణలను ప్రొక్లైన్లతో తొలగించామని కమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు.

తొలుత గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కంట్రోల్ రూమును మంత్రి పరిశీలించారు. విపత్తు నిర్వహణ శాఖ డి.పి.ఎం. మాధురి ఆధ్వర్యంలో 24 గంటలూ పనిచేసేలా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. కాగా, ఏ విషయాలకు | సంబంధించిన ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని ఇందులోని సిబ్బందితో మంత్రి ఆరాతీశారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే సమన్వయంతో పరిష్కరించేలా చూడాలని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి గోపీచంద్, గృహనిర్మాణ అధికారి పి.శ్రీనివాసప్రసాద్, డి.పి.ఓ. జి. వెంకటనాయుడు, డి.టి.సి. సుశీల, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. డి.ఎం. ఓ.శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *