ఈ నెల 16వ తేదీన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ దృష్ట్యా అత్యవసరమైతేతప్ప ప్రజలెవరూ ఇళ్లలోనుంచి బయటకు రావద్దని ఆమె సూచించారు. వర్షాల వలన ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉందని మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు.
సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో సగటున 51 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని కలెక్టర్ తెలిపారు. శింగరాయకొండ, పొన్నలూరు, ఎన్.జి.పాడు, ఒంగోలు, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, కొత్తపట్నం, సి.ఎస్.పురం, మద్దిపాడు, పొదిలి, తాళ్లూరు, పామూరు, ఎస్.ఎన్.పాడు, పి.సి.పల్లి, ముండ్లమూరు మండలాలలో 80 మి.మీ. ల కంటే అధిక వర్షం కురిసినట్లు చెప్పారు. చీమకుర్తి, మర్రిపూడి, హెచ్. ఎం. పాడు, వెలిగండ్ల, కనిగిరి, కె.కె. మిట్ల, కురిచేడు, దొనకొండ, మార్కాపురం, దర్శి మండలాలలో 40-80 మి.మీ. లవర్షం కురిసినట్లు వివరించారు. మిగతా మండలాలలో 40 మి.మీ. లకన్నా తక్కువ వర్షం కురిసినట్లు తెలిపారు.
18 గ్రామాలపై ప్రభావం . . . .
ఈ భారీ వర్షాలు జిల్లాలోని తీరప్రాంత నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండ మండలాలలోని 18 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించామని కలెక్టర్ చెప్పారు. వీటి పరిధిలోని 54 హాబిటేషన్లలో ఉంటున్న 56,584 మంది ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ హాబిటేషన్ల పరిధిలో పక్కా గృహాలు 9,860, సెమీ పక్కా గృహాలు 3,677, కచ్చా ఇళ్లు 1,058 గుర్తించినట్లు చెప్పారు. ఈ మండలాలలో 33 పునరావాస కేంద్రాలను ముందస్తుగా గుర్తించామని, 5 కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్తపట్నంలో 2, టంగుటూరులో 1, శింగరాయకొండ (పాకల)లో 1, ఎన్.జి. పాడులో 1 నిర్వహిస్తున్నామన్నారు. ఈ పునరావాస కేంద్రాలలో 214 మందికి ఆశ్రయం కల్పించి నాణ్యమైన భోజనం, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాలలో అవసరమైన సదుపాయాలను కల్పించామన్నారు.
జిల్లాకు ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందం . .
పరిస్థితిని బట్టి అవసరమైన సహాయక చర్యలలో పాల్గొనేందుకు 30 మందితో కూడిన ఒక ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందం కూడా జిల్లాకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాలవల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించేలా జిల్లా కలెక్టర్ | కార్యాలయంలో 1077 టోల్ ఫ్రీ నెంబరుతో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలవైపు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. అలాంటి ప్రాంతాలలోని కాజ్వేలు, బ్రిడ్జీలు, కల్వర్టుల వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా | ప్రజలను అప్రమత్తం చేసేలా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల సిబ్బందితో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు కూడా సహకరించి ప్రమాదకర స్థలాలవైపు వెళ్లకుండా, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉండకుండా దగ్గరలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందాలని కలెక్టర్ సూచించారు.
