భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత తో కలసి మంగళవారం ఉదయం ఒంగోలు నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వకుండా పూడికతీత పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తొలుత జిల్లా కలెక్టర్ పోతురాజు కాలును పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో వర్షం నీరు నిల్వకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం కొప్పోలు రోడ్డు లోని జర్నలిస్టు కాలనీ 1వ లైను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా నిన్నా, ఈ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లాలో కోస్టల్ మండలాలు ఐదు వున్నాయి, ఈ ఐదు కోస్టల్ మండలాల్లో 53 హబిటేషన్లు వున్నాయి, అందులో పూరి ఇళ్ళను గుర్తించడంతో పాటు 15 పునరావాస కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఇందులు 5 పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఓపెన్ చేసిన సోమవారం నుండి ఆ ప్రాంత ప్రజలకు భోజన వసతులు కల్పించడం జరుగుచున్నదన్నారు. ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పడపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి మండలాల్లో 75 మి. మీ వర్షపాతం నమోదు కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వాగులు, కల్వర్ట్ లలో నీరు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. వాగులు వంకల్లో, సైడు కాలువల్లో, అన్నిచోట్ల డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తను, పూడికతీత పనులు యుద్దప్రాతిపదికన చేపట్టడం జరుగుచున్నదని కలెక్టర్ వివరించారు. ఆయా ప్రాంతాల్లో విఆర్వోలు, వార్డు అమినిటీ, శానిటేషన్ సెక్రటరీలను నియమించి పనులు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తూ జిల్లా యంత్రాంగం అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట, నగరపాలక సంస్థ కమిషనర్ వేంకటేశ్వర రావు, ఆర్డీవో లక్ష్మి ప్రసన్న, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

