భారీ వర్షాల నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా కొత్తపట్నం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి, తుఫాన్ బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలను, వసతులను పరిశీలించారు.
తొలుత జిల్లా కలెక్టర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని సందర్శించి ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడి అందిస్తున్న వసతులు, భోజన సదుపాయాలను గురించి అడిగితెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని సందర్శించి పునరావాస ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా అవసరమైన వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజన సదుపాయాలను అందించాలని తహశీల్దార్ ను ఆదేశించారు. పూర్తిగా తుఫాన్ ప్రభావం తొలిగేవరకు పునరావాస సదుపాయాలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
జూనియర్ కళాశాలలో 40 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 35 మంది ఆశ్రయం పొందుతున్నారని, వీరి కోసం 24 గంటలు వైద్య సేవలు అందించేలా మెడికల్ క్యాంపు లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తహశీల్దార్ శ్రీ మధుసూధన రావు, జిల్లా కలెక్టర్ కు వివరించారు.
కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, అధికారులు పాల్గొన్నారు.


