17 న ఆశ్వయుజ పౌర్ణమి -మహర్షి వాల్మీకి జయంతి.

వేద సంస్కృతిలో ఉన్న మహోన్నతమైన మానవత్వపు విలువలను సాధారణ ప్రజానీకానికంతటికీ సులభతరంగా అందజేయాలనే దివ్యమైన లక్ష్యంతో సకల సద్గుణాభిశోభితుడైన శ్రీరామచంద్రుని జీవితాన్ని ఆలంబనగా చేసుకొని శ్రీరామాయణ మహాకావ్యాన్ని అప్పటి సాధారణ జనులు పాడుకొనే జానపద కావ్యంగా వ్రాసి లవకుశులకు నేర్పించి అనేకచోట్ల ప్రచారంగావించి సమాజంలో నైతిక విలువలను, ధార్మిక విలువలను నెలకొల్పడానికి దీక్ష వహించిన మహా సంఘసంస్కర్త మహర్షి వాల్మీకి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆశ్యయుజ పౌర్ణమి నాడు అట్టి మహోన్నతమైన వాల్మీకి మహర్షి జయంతి. అరణ్యప్రాంతాలలో బోయవాని ఇంట జన్మించి దుర్మార్గమైన జీవనాన్ని గడిపి సకలలోక పూజితునిగా మారిన మహనీయుగా వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శం.

శ్రీరాముని జీవితం ఆధారంగా మన మన కుటుంబాలలోని బంధాలు ఏ విధంగా ఉండాలో, పరిపాలకులు ఎలా ఉండాలో, సామాజిక బాధ్యతలు ఎలా నిర్వహించాలో, నీతి నియమాల ప్రాధాన్యతలు ఎంతగొప్పవో, ధర్మమార్గ అనుసరణ ఎలా చేయాలో… సుస్పష్టంగా రచియించి, మానవ జీవన మనుగడకు ఒక మార్గదర్శక గ్రంథంగా ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యమైన శ్రీరామాయణాన్ని వ్రాసిన ఆదికవి మహర్షి వాల్మీకి.

సప్త ఋషుల మంత్రోపదేశంతో రామ అని కూడా పలకడం రాక “మరా” “మరా” అంటూ పదే సార్లు పలుకుతూ రామనామ జపాన్ని ప్రారంభించి భగవంతుని తపస్సులో మునిగి శరీరమంతా శుష్కించినాసరే, నిండా పుట్టలు పట్టినా సరే ఏమాత్రం చలింపక మహా ఘోరమైన తపస్సుచేసి భగవంతుని సాక్షాత్కారం పొంది వల్మీకం (పుట్ట) నుండి బయటకు వచ్చిన మహా తపస్వి మహర్షి వాల్మీకి,

ఇటువంటి ఎందరో మహనీయుల జన్మభూమి మన హిందూదేశం. కులము – మతము – వర్గము ప్రాంతము – రాజకీయము – పదవులు ఇవేవీ మన మధ్య అడ్డుగోడలు కాకూడదు. కొందరు స్వార్ధపూరిత వ్యక్తుల వలన వివిధ కులాల మధ్య వివిధ రంగాలలోను ఎప్పుడో జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న దుస్సంఘటనలను ఎవరూ సమర్దించరు. అటువంటి సంఘటనలు జరగకుండా మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. అంతేతప్ప వాటినే ఉదాహరణలుగా చెప్పుకుంటూ మనలోమనం నిత్యం విద్వేషాలు వెదజల్లుకుంటూ జీవించడం సరియైన పద్దతి కాదు. వీటన్నింటికీమించి మనమందరం భారతమాత సంతానం. అన్ని కులాలలోను ఎంతోమంది మహనీయులు జన్మించారు. వారందరూ మనందరి క్షేమంకోసం పరితపించారు. వారందరూ మనందరికీ ఆరాధ్యనీయులే… కలిసి ఉందాం – కలుపుకొందాం :: మన దేశ ధర్మం నిలుపు కొందాం అంటూ విశ్వ హిందూ పరిషత్ మందిర, అర్చక పురోహిత విభాగం జిల్లా ప్రముఖ్ డా. లంకా ప్రసన్నకుమార్ శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *