సురక్షితమైన రైలు కార్యకలాపాల నిర్వహణ కోసం ఖచ్చితమైన భద్రత ప్రమాణాలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ రైలు కార్యకలాపాలలో భద్రతను నిర్ధారించి, ప్రామాణిక భద్రతా విధానాలను విధిగా పాటించాలని సిబ్బంది మరియు అధికారులకు సూచించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో రైళ్ల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు మరియు సరుకు రవాణాపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు , గుంటూరు మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్‌లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
జనరల్ మేనేజర్ రైలు కార్యకలాపాల భద్రతపై మాట్లాడుతూ, రైలు కార్యకలాపాలలో సమన్వయం పాటించాలని మరియు రైళ్లను నడుపుతున్నప్పుడు అన్ని భద్రతా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నిర్ణీత నిబంధనల ప్రకారం భద్రతకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి ఆయన సూచించారు మరియు సిబ్బందికి ప్రామాణిక మార్గదర్శకాలను పునరుద్ఘాటించాలని అధికారులను ఆదేశించారు. చిన్నచిన్న అసాధారణ సంఘటనలు మరియు సంఘవిద్రోహ కార్యకలాపాలపైనా చర్చించారు. అలాంటి కార్యకలాపాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్)ని ఆయన ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రయాణికుల అక్రమ ట్రాక్ క్రాసింగ్‌ల సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ట్రాక్‌లపై చర్చించి జోన్ లో మూడవ , నాలుగులైన్ ల పనులను చేపట్టేటప్పుడు ట్రాక్ పై నీటి నిలవలు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జోన్ లో సరుకు రవాణా కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. బొగ్గు, సిమెంట్, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇనుప ఖనిజం మొదలైన వాటి లోడింగ్‌పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సరకు రవాణా లోడింగ్ మెరుగుపరచడానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మరియు లోడింగ్ లక్ష్యాలను చేరుకోవడానికి రైల్వే వాటాదారు లతో తరచుగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
దక్షిణ మధ్య రైల్వే ఆర్.పి. ఎఫ్ చే అభివృద్ధి చేయబడిన ‘లూకర్ స్టూడియో’ను ప్రారంభించారు. ఇది హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగుతో సహా బహుళ భాషలలో విద్యా మరియు అవగాహన వీడియోలు వాయిస్‌ఓవర్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యానిమేషన్‌లు, డైనమిక్ ట్రాన్సిషన్‌లు మరియు ఇమేజ్‌లు వంటి విభిన్న మల్టీమీడియా అంశాలను చేర్చడం ద్వారా అధునాతన కృత్రిమ మేధస్సు సాధనాలను ఉపయోగించి తయారు చేయబడ్డాయి. భద్రత మరియు సురక్షిత ప్రయాణంపై ప్రజలకు మరియు రైల్వే సిబ్బందికి అవగాహన మరియు విద్యను పెంపొందించడంలో ఈ వనరులు ప్రయోజనకరంగా ఉంటాయని తెలియజేశారు.


