2024-25 సంవత్సరం రబీ సీజన్లో వరి పంటకు ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోపు రైతులు పంటల బీమా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు. జిల్లాల వారీగా పంటలు సాగవుతున్న తీరు, బీమా, తదితర అంశాలపై రాజశేఖర్ సమీక్షించారు.
అనంతరం ఆయా అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. వరి పంటకు డిసెంబరు 31 లోపు, జొన్న, శనగ, మినుము, మొక్కజొన్న, మిరప పంటలకు మాత్రం డిసెంబరు 15 లోపు ప్రభుత్వం నిర్ణయించిన బీమా ప్రీమియం చెల్లించేలా చూడాలని ఆమె చెప్పారు. పంట రుణాలు తీసుకునే సమయంలోనే ప్రీమియం డబ్బులను బ్యాంకులు మినహాంచుకునేలా రైతులు అంగీకారం తెలపవచ్చని, రుణాలు తీసుకోని వారు విడిగా కూడా చెల్లించవచ్చని, బీమా అనేది స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఈ గడువు తేదీలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, ఉద్యాన శాఖ అధికారులు, లీడ్ బ్యాంకు, పి.డి.సి.సి. బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

