ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో ప్రజా సమస్యల పరిష్కారవేదిక ‘మీకోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 242 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మీకోసం అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని చెప్పారు. మొక్కుబడి సమాధానాలతో అర్జీదారులకు ఎండార్స్మెంట్ ఇచ్చేసి సమస్యను పరిష్కరించినట్లుగా రికార్డులలో చూపితే సహించబోనన్నారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కావాల్సిందేనని, పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆమె స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలలో భాగంగా అవినీతికి వ్యతిరేకంగా, బాధ్యతగల పౌరునిగా ప్రవర్తిస్తామంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వరరావు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


