ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశంసోమవారం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు, ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం, ఎస్.ఎన్ పాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డా. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, టి. చంద్రశేఖర్, బి.ఎన్ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలైన ఉద్యాన శాఖ మైక్రో ఇరిగేషన్, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖలతో పాటు ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించి అజెండా అంశాలపై చర్చించగా, పలువురు శాసన సభ్యులు పలు సమస్యలను మంత్రులు, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకురావడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగే తొలి జిల్లా సమీక్ష మండలి సమావేశంలో వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలైన ఉద్యాన శాఖ మైక్రో ఇరిగేషన్, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖలతో పాటు ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలపై కూలంకషంగా ప్రశాంత వాతావరణంలో చర్చించడం జరిగిందని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ది కి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ కల్సి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన మంత్రుల పేర్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేరు పేరునా గుర్తుచేస్తూ ప్రకాశం జిల్లా పరిపాలనలో వారి పాత్ర ఎంతో వుందని గుర్తుచేశారు. ప్రకాశం జిల్లా పూర్తిగా వర్షాధారం పై ఆధారపడిన జిల్లా అని, రైతులందరూ అబివృద్ది చెందాలన్నా, బీడు భూములను వినియోగంలోకి తీవాలన్నా జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్ట్స్ ను పూర్తీ చేసుకున్నప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని మంత్రి అన్నారు. జిల్లాలో వెలిగొండ, గుండ్లకమ్మ, రామతీర్ధం ప్రాజెక్ట్స్ ముఖ్యమైన ప్రాజెక్ట్స్ వున్నాయని, అందులో ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తీ చేసుకొంటే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలకు కలిపి మొత్తం 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 22 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తీ అయితే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలకు సాగు, తాగు నీరు అందుతుందని మంత్రి వివరించారు. నేడు ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు అంతరించే పరిస్థితి ఏర్పడిందని, ప్రసిద్ది చెందిన ఒంగోలు జాతి ఆవులను, ఎద్దులను వృద్ది చేసుకోవాల్సిన భాద్యత మనందరిపై వుందని మంత్రి అన్నారు. జిల్లాలోని చదలవాడ పశు క్షేత్రాన్ని పూర్తీ స్థాయిలో సమగ్రంగా అబివృద్ది చేసి ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులను వృద్ది చేసుకొనేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో 50 గోకులంలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, అందుకనుగుణంగా గోకులం నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆవు నేయి ప్రాధ్యానత ఎంతో వుందని, ఎ ఆలయంలోనైనా ఆవు నేయితో కార్యకలాపాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందువలన పశు సంపద పెంచడంలో భాగంగా గేదెలతో పాటు ఆవులను కూడా వృద్ది చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఆవు సంపదను వృద్ది చేసేందుకు డ్వాక్రా మహిళలకు మరియు రైతులకు ఎక్కువ శాతం సబ్సిడీతో యూనిట్స్ మంజురుకు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మత్స్యకారులు ప్రయోజనాలు దెబ్బతినకుండా తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి ప్రకాశం జిల్లా ప్రాంతానికి తమిళనాడుకు చెందిన హై స్పీడ్ మరబోట్లు రాకుండా చర్చించడంతో పాటు సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో 890 దేవాలయాలు, 111 ధార్మిక సంస్థ లు వున్నాయని వీటి అన్నింటికీ కమిటీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. జిల్లా లో సర్వీసు ఈనాం భూములు అన్యాక్రాంతం కాకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించి లీజు ద్వారా జిల్లాకు 2023-24 సంవత్సరంలో 8.58 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాను అన్నీ రంగాల్లో అభివృద్ధి పదంలో ముందు నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…. జిల్లా ను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తీ చేసేలా ప్రణాళికా బద్దంగా ముందుకు పోవడం జరుగుచున్నదన్నారు. గత నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితిని చూడటం జరిగిందన్నారు. జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ రానున్న రెండు నెలల్లో పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పూర్తీ చేసేలా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… స్థల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అని, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, మూసీ, పాలేరు నదులు ప్రవహిస్తున్నాయన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు ల కింద గుండ్లకమ్మ, రామతీర్ధం ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. స్వర్ణాంద్ర@2047 విజన్ ప్రణాళిక ను రూపొందించడం జరిగిందని, ఇప్పుడు వున్న జిడిపి రేటు 50,350 కోట్లను రానున్న 5 సంవత్సరాల కాలంలో 15 శాతం వృద్ది తో ప్రణాలికను రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో చేపట్టిన అనేక ప్రాజెక్టులకు సంబంధించిన భు సేకరణ ప్రక్రియలను పూర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో చేపట్టిన ప్రధాన ప్రాజెక్టు అయిన వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తీ చేయడానికి అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. స్వీకారం కార్యక్రమం కింద జిల్లా లోని అన్నీ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. జిల్లా లో ఉపాధి హామీ పధకం కింద మెటీరియల్ కంపోనేంట్ కింద 120 కోట్ల రూపాయలు మంజురుచేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎస్.సి ఎస్.టి కాలనీల్లో సిసి రోడ్లు, సైడు కాలువలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి రీ సర్వే ఏర్పడిన సమస్యలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ…. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తీ చేస్తే సుమారు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రాజెక్టును పరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ…జిల్లాలో అన్నీ ప్రభుత్వ అతిధి గృహాలు దెబ్బతిన్నాయని, వాటిని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయని, వాటిని కూడా ఆధునీకరించాల్సిన పరిస్థితి వుందని జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ…. పాలేరు, బింగినిపల్లి చెరువులకు సంబంధించి వాటి స్టోరేజి సామర్ధ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం వుందని, అందుకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డైయిరీ ని పునర్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ…. ప్రకాశం జిల్లా జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ను త్వరగా పూర్తీ చేయుటకు ప్రణాళికా బద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒంగోలు జాతి ఆవులను, ఎద్దులను వృద్ది చేసుకోవాల్సిన అవసరం వుందని ఇంచార్జి మ్మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు మాట్లాడుతూ…. జిల్లాను వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ…. నగరంలోని పోతూ రాజు కాలువ ఆధునీకరణకు 2014-19 లో 89 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారుచేయగా, 2019లో గత ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో 62 కోట్ల రుపాయలతో పనులు చేపట్టి 42 కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఇంచార్జి మంత్రిని కోరారు. అలాగే టిడ్కో ఇళ్ళు దాదాపు 80 శాతం పనులు పూర్తీ కావడం జరిగిందని, సంబంధిత లబ్దిదారులకు ఈ గృహలపై రుణాలు కూడా మంజూరు చేయడం జరిగిందని, వీరికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వగ పోగా తీసుకున్న రుణాలకు నెల నెలా బ్యాంకులకు వడ్డీ కట్టుచున్నారని, టిడ్కో ఇళ్ళు త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఒంగోలు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం వుందని, అలాగే రిమ్స్ లో దంత వైద్య కళాశాలను మంజూరు చేయడంతో పాటు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టం ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రిని కోరడం జరిగింది.

గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ… నియోజక వర్గ పరిధిలో చాలా గ్రామాల్లో భూములను దేవాదాయ భూములుగా నమోదు చేయడం జరిగిందని, దాంతో ఆ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నియోజక వర్గ పరిధిలో అనేక చెరువులకు పుడిక తీయాల్సిన అవసరం వుందని సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ….నియోజక వర్గ పరిధిలో ఎక్కువ భూ ఆక్రమణ కేసులు నమోదు కావడం జరిగిందని, వీటిని సమగ్రంగా పరిశీలించి భాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం వుందని, అలాగే తాగునీటి సమస్య కూడా ఎక్కువగా వుందని, వెనుకబడిన ఈ ప్రాంతంలో ఈబిసి సర్టిఫికేట్ జారిలో వారి ఆర్ధిక స్తోమతను దృష్టిలో వుంచుకొని జారి చేయాల్సిన అవసరం వుందని నారాయణ రెడ్డి, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

ఎస్.ఎస్.పాడు శాసన సభ్యులు బి.ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ… నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సిసి రోడ్లు, సైడు కాలువలు నిర్మాణంలో నియోజక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే పెర్నిమిట్ట వద్ద గల 187 ఎకరాల చెరువు వుందని, ఈ చెరువును సమ్మర్ స్టోరేజి ట్యాంకు గా అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని విజయ కుమార్, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పొదుపు సంఘాల్లో రుణాలకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు.

దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… తాళ్ళూరుకు వెళ్ళే రహదారి పై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం త్వరగా పుర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సచివాలయాలు, ఆర్.బి.కే ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో బిల్లు లు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొగలిగుండాల రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కనిగిరి శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ పరిధిలో వున్న చెరువులను స్తిరీకరించాల్సిన అవసరం వుందని, తద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగే అవకాసం వుందన్నారు.

యర్ర గొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ… నియోజక వర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా వుందని, త్వరగా వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తిచేసిన ఈ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను, డిగ్రీ కాలేజీలో ఉన్న మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివి నాగ్ జిల్లా రెవెన్యు అధికారి చైనా ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *