రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉండాలి జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల పై మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయ, ట్రాన్స్ పోర్టు, మార్కెటింగ్, కోపరేటివ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 రబీ సీజన్ లో వ్యవసాయ శాఖ వారి అంచనాల ప్రకారం 59,547 మెట్రిక్ టన్నుల ధాన్యం, 61, 583 మెట్రిక్ టన్నుల రెడ్ గ్రామ్ పంట ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ రబీ సీజన్ లో ఉత్పత్తి అయిన పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉండాలన్నారు. ఇందుకు సంబందించి టెక్నికల్ అసిస్టెంట్లు, వీఎవోలు ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసుకొనేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రక్కా ప్రణాళికతో గన్నిబ్యాగ్స్, హామాలీలు, ట్రాన్స్ పోర్టు వాహనాలు, ముందుగానే సిద్దం చేయాలన్నారు. గన్నీ బ్యాగ్స్ సమస్య తలెత్తకుండా ముందుగానే ఎన్ని అవసరమో నిర్థారించి, సిద్దం చేయాలన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయి సేకరణ కమిటీ ల ఏర్పాటు తో పాటు సంబంధిత కమిటీ ల సమావేశాల షెడ్యూల్ ను రూపొందించి ఈ నెలాఖరు నాటికి అన్నీ స్థాయిలో కమిటీల సమావేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, డి.ఎస్.ఓను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, డి ఎస్ వో పద్మశ్రీ, డీటీసీ సుశీల, జిల్లా సహకార శాఖాధికారి శ్రీనివాసులు రెడ్డి, వ్యవసాయ, సివిల్ సప్లై , మార్కెటింగ్, ఎఫ్ సీఐ. శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.


