కార్తీక దామోదర మాసం అత్యంత ప్రశస్తమైనదని, ఈ మాసంలో తులసి చెట్టు, ఉసిరి, మారేడు వృక్షాల చెంత శివకేశవులను పూజించడం, అర్చించడం, ధ్యానించడంతో సకల పాపాలు నశించి, పరమపావనమైన దివ్యపథం చేరడం జరుగుతుందని రాష్ట్ర మహేంద్ర మేదర సంఘ అధ్యక్షులు టంగుటూరి యల్లలబాబు తెలిపారు.
సోమవారం స్ధానిక బాపూజి మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా కృష్ణా ఫాషన్స్ దగ్గర ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కరపత్రావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యల్లాల బాబు మాట్లాడుతూ సామూహికంగా ఒక దగ్గర చేరి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడంతో ఐక్యత పెరగడం, సాదకబాధలు తెలుసుకొని వాని సాధనకు ఉమ్మడిగా కృషి చేయగలుగుతామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ రాష్ట్ర మేదర సంఘ కార్పొరేషన్ చైర్మన్ కేత లలిత నాంచారమ్మ మాట్లాడుతూ ఒంగోలు మేదర సంఘం ఆధ్వర్యంలో ఈ నవంబర్ నెల 17వ తేదీ ఆదివారం ఐశ్వర్య నగర్ లోని సదా రామ నామ క్షేత్రంలో కార్తీక వనభోజనాలు ఉదయం 10 నుండి సాయంత్రం వరకు జరుగుతాయని, ప్రారంభంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, ప్రత్యేక పూజలు, అనంతరం మహిళలకు పిల్లలకు ప్రత్యేకమైన ఆటల పోటీలు, తదుపరి కార్తీక వనభోజనాలు జరుగుతాయని తెలిపారు. కావున సంఘంలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
కరపత్ర ఆవిష్కరణలో ఒంగోలు మేదర సంఘ అధ్యక్షులు కేత నర్సింహారావు, కొండా నారాయణ, చలపతి రావు, పిల్లి శ్రీను, పిల్లి మధు, కేతా హరికృష్ణ, కేతా సరేంద్ర, కేతా మాధవరావు, గుండా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
