11 సంవత్సరాల వయస్సు లోపుగల బాలబాలికలకు ప్రకాశం జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినీ బాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ -2024 ను ఒంగోలులోని లార్డ్ కృష్ణ బాడ్మింటన్ అకాడమీ లో సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కూడా కాసేపు క్రీడాకారులతో బాడ్మింటన్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ ఛాంపియన్షిప్ లో ప్రకాశం, ఈస్ట్ గోదావరి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కృష్ణ, కడప, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విజయవాడ, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుండి బాలబాలికలు పాల్గొననున్నారు. ఇక్కడ గెలుపొందిన వారు నేషనల్ స్ధాయిలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… బాలబాలికల్లో క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ఈ ఛాంపియన్షిప్ ఎంతోగాను దోహదపడుతుందన్నారు. పిల్లల్లో ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడల్లో ప్రావీణ్యత సాధించేందుకు తల్లిదండ్రులు వారి పిల్లల్లో దాగి ఉన్న క్రీడా కౌశల్యాన్ని వెలికితీసేందుకు కృషి చేయాలని, క్రీడల్లో వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు.
బాల్యదశ నుండి ఆటలు ఆడటం, వ్యాయామాలు చేయుట వలన శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం చేకూరుతుందని, అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఆటలు ఓటమిని భరించే శక్తిని, కష్టాన్ని ఎదుర్కొన్నే ధైర్యాన్ని ఇస్తాయన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలని, నిత్యము నేర్చుకునే తత్వాన్ని , పోటీతత్వాన్ని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, తల్లిదండ్రుల, గురువుల మాటలు చక్కగా వింటూ బాగా చదువుకోని ఉన్నత స్ధానాలకు చేరుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఈ ఛాంపియన్షిప్స్ లో ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ. 2000, ద్వీతీయ స్థానంలో నిలిచిన వారికీ రూ. 1000 చొప్పున పోలీస్ శాఖ తరుపున నగదు ప్రోత్సాహకం అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, AP బాడ్మింటన్ సెక్రటరి అంకమ్మ చౌదరి, APBA ప్రెసిడెంట్ ద్వారకానాధ్, ప్రకాశం జిల్లా అసోసియేషన్ చైర్మన్ అద్దంకి మురళి కృష్ణ, లార్డ్ కృష్ణ బాడ్మింటన్ అకాడమీ చైర్మన్ శిద్ధా సుధీర్ కుమార్, కోచ్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.






