బేగంపేట నుంచి అల్వాల్
వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు పిల్లర్ నెంబర్ 12 90 వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి తలకు, ముఖానికి తీవ్ర గాయాలై రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ సమయంలో అటువైపు ప్రయాణిస్తున్న వాహనదారులు అతన్ని పట్టించుకోకుండా వెళుతున్నారు. ఇదే సమయంలో బేగంపేట నుంచి పరేడ్ మైదానానికి తన వాహనంలో వెళుతున్న బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు వాసం నితీష్ (24) ను తన వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించారు. ప్రమాదంలో నితీష్ గాయపడిన సమాచారాన్ని నితీష్ భావ రాజశేఖర్ కు తెలియజేశారు. దీంతో వారు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నితీష్ ను పరీక్షించిన వైద్యులు గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి చేర్చారని, కొద్దిగా ఆలస్యమైన అతని పరిస్థితి ప్రమాదకరంగా వుండేదని, వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ప్రమాదంలో గాయపడిన నితీష్ తలలో కొంతమేర
రక్తం గడ్డ కట్టిందని, ముఖంపై గాయాలయ్యాయి అని వైద్యులు అన్నారు. సకాలంలో స్పందించి తీవ్రంగా గాయపడిన నితీష్ ను తన వాహనంలో ఎక్కించుకొని నేరుగా ఆసుపత్రికి తరలించిన బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తిని యశోద వైద్యులు అభినందించగా, నితీష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. 108 వాహనం కోసం ఎదురు చూడకుండా తను వాహనంలో సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతోనే తన బావమరిది ప్రాణాలు దక్కాయని నితీష్ బావ రాజశేఖర్ ఏసీపీకి ధన్యవాదాలు తెలియజేశారు. నితీష్ ఆదివారం మధ్యాహ్నం అల్వాల్ లోని నివాసం నుంచి తన యాక్టివా పై బయలుదేరి బేగంపేట ప్రకాష్ నగర్ కు వెళ్లాడని తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యడన్నారు. ఏసిపి గోపాలకృష్ణమూర్తి సకాలంలో స్పందించడం వల్లే నితీష్ ప్రాణాలతో బయటపడ్డాడు అన్నారు. తామంతా ఏసిపి గోపాలకృష్ణమూర్తి చేసిన సహాయానికి ఎంతో రుణపడి ఉంటామని నితీష్ కుటుంబ సభ్యులు తెలియజేశారు.

