ప్రకాశం జిల్లాలోని బాలలకు బంగారు బాల్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు జి.జి.హెచ్.లో ' కంగారు మదర్ కేర్ ' సెంటరును ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. మంగళవారం ఆమె జి.జి.హెచ్.ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ న్యూ బోర్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కనిగిరి సి.హెచ్.సి.లో ' కె.ఎం.సీ '
ఫైలెట్ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంను జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తరించే ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం జి.జి.హెచ్.లో గైనిక్ మరియు నవ జాత శిశు కేంద్రాలను పరిశీలించినట్లు చెప్పారు.
కె.ఎం.సీ. అంటే.. ?
తన బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా సహజ సిద్ధమైన పౌచ్ (సంచి)లో దాచి ప్రాణాలు కాపాడే జీవి... కంగారు. ఇదే విధానాన్ని అమలు చేయడం ద్వారా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు, బరువు తక్కువగా పుట్టిన శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా చూడాలన్న ఆలోచనతోనే ' కంగారు ' మోడల్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అప్పటివరకు కడుపులో ఉండి ఈ లోకంలోకి వచ్చిన బిడ్డకీ, తల్లికీ ఇప్పుడు కూడా పరస్పరం శారీరక సంబంధం ఉండేలాగా బిడ్డను తన ఛాతి పైన సాధ్యమైనంత ఎక్కువ సమయం పడుకోపెట్టుకోవడం ద్వారా వెచ్చదనాన్ని, ప్రేమను తల్లి పంచడం, సరైన విధానంలో పాలు పట్టడం, పోషణ, శుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ విధానం లక్ష్యమని ఆమె చెప్పారు.
డ్రైనేజీ సమస్యకు పరిష్కారం…
దాదాపు రెండు గంటల పాటు జి జి హెచ్ లో కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. తొలుత గైనిక్ విభాగంలోని లేబర్ రూముతో పాటు అన్ని వార్డులను పరిశీలించారు. జి జి హెచ్ సూపెరింటెండ్ట్ మరియు గైనిక్ హెచ్ ఓ డి లను ప్రసవాలు, క్రిటికల్ కేర్ ప్రొసీజర్ ని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య ఉందని, దానిని పరిష్కరించామని, నేటితో సమస్య కొలిక్కి వస్తుందని అధికారులు ఆమెకు తెలిపారు. వార్డుల్లో బాత్ రూమ్స్ ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న వార్డు హెడ్ నుర్సులకు ఛార్జి మెమో ఇవ్వాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అనంతరం నవ జాత శిశు కేంద్రాన్ని, పోషకాహార కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట సూపరెంటెండెంట్ డా.టి.జమున , డిప్యూటీ సూపరెంటెండెంట్ డా.నామినేని కిరణ్ , పలు విభాగాల హెచ్.ఓ.డి.లు ఉన్నారు.




