ప్రపంచ యవనికపై అన్ని రంగాలలో మన జిల్లా బిడ్డలు ప్రకాశించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆకాంక్షించారు. ఈ దిశగా ఆరోగ్య, సురక్షిత, సంతోషకరం, సాధికారతతో కూడిన బాల్యాన్ని మన జిల్లాలోని బాలలందరికీ ఇవ్వాలన్న లక్ష్యంతోనే “బంగారు బాల్యం” కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.
వారం రోజులపాటు నిర్వహించిన బంగారు బాలోత్సవాలు ముగింపు సందర్భంగా పి.వి.ఆర్. బాలుర హైస్కూల్లో బుధవారం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ….ప్రతి ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ దిశగా అంగన్వాడీలు, పాఠశాలల్లో పిల్లలకు అనుకూలమైన వాతావరణం కల్పించి మెరుగైన విద్య, భోజనం అందించడంపై దృష్టి సారించామన్నారు. బాలలపై నేరాలు జరగకుండా, వారు బాలకార్మికులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. తమలోని ప్రతిభను చాటుకునే అవకాశాన్ని ప్రతి బిడ్డకూ కల్పించాలన్నారు. ఈ క్రమంలో పేదరికం అడ్డురాకుండా బంగారు బాల్యం కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన ప్రకాశం జిల్లా పిల్లలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాలన్నదే తన కల అని కలెక్టర్ తెలిపారు. బాల్యం తీపిగుర్తుగా ఉండాలితప్ప గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ బిడ్డా నిరుత్సాహపడే పరిస్థితి రాకూడదని అన్నారు. ఈ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు ఇందుకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ వారంపాటు నిర్వహించిన ఉత్సవాలతోనే ఈ కార్యక్రమం ముగిసిపోలేదని, నిరంతరం ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. బాల్య వివాహరహిత, బాల కార్మికరహిత, ఆరోగ్యకర, అక్షర చైతన్యవంతమైన ప్రకాశం జిల్లా ఆవిష్కృతమే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. పరిస్థితిని నిరంతరం గమనించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వివిధ శాఖల అధికారులతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెలా ఈ కమిటీలు సమావేశమవుతాయన్నారు. బాలకార్మిక, బాల్య వివాహాల బారినపడే వారికి బంగారు బాల్యం మాత్రమే కాకుండా బంగారు భవిష్యత్తు కూడా ఉండేలా ఆయా పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టి వ్యక్తిగత ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ లీడర్లను కూడా భాగస్వాములను చేసి సమన్వయంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. బాలోత్సవాలలో భాగంగా వివిధ స్థాయిలలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఈ బాలోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ… బంగారు బాల్యంకు తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల శ్రద్ధ, మంచి స్నేహితుల సాంగత్యం, పోలీస్ శాఖ వంటి రక్షణ వ్యవస్థలు ముఖ్యమన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలన్నారు. చదువుల్లో క్రమశిక్షణ ఎంత అవసరమని క్రమశిక్షణ లేకపోతే బంగారు భవిష్యత్తుకు బాటలు ఉండవని, విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు సెల్ ఫోన్లు అవసరం మేరకే వినియోగించాలని, ఫోన్లో అనవసరమైన/తెలియని వాటి జోలికి వెళ్ళరాదన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలన్నారు.నకిలీ ఫోన్ కాల్స్/ ఎస్ఎంఎస్ లు, మోసపూరిత లింకులు, ఓటీపీలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, బెదిరింపులు, లాటరీ/కూపన్స్ పేరిట జరిగే వివిధ రకాల సైబర్ నేరాల గురించి విద్యార్థులకు వివరించి వాటి నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియపరిచారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థినులకు “గుడ్ టచ్” మరియు “బ్యాడ్ టచ్”, అనుమానాస్పద వ్యక్తులు, వారి వ్యవహారశైలిని గుర్తించడం మరియు స్వీయ రక్షణ, ఆకర్షణ, ప్రేమ ప్రభావాలు, చీటింగ్, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ లపై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులు రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణాల్లో పాటించాల్సిన మెళకువలను తెలియజేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, క్రమ శిక్షణతో చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి మాట్లాడుతూ…సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ప్రతిఒక్కరూ చదువుకావాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి వారంరోజుల పాటు బంగారు బాలోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్ధేశించుకొని మంచి నడవడిక, క్రమశిక్షణతో ముందుకు వెళ్లి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి మాధురి, సార్డ్స్ ప్రతినిధి సునీల్ మాట్లాడుతూ…. జిల్లాలో వారం రోజుల పాటు చేపట్టిన బంగారు బాల్యం బాలోత్సవాల కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో శరత్ ఆలపించిన బంగారు బాల్యం మనదే , బాలలదే బంగారు బాల్యం బాలలదే అనే సాంగ్, బాల్య వివాహలపై లాస్య బృందం నిర్వహించిన స్క్రిప్ట్ ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్దులు ఆనందకిరణ్, సంతోషి, సహస్ర, కైసర్ చదువు యొక్క ఆవశ్యకతను గురించి, తాము ఏ పరిస్థితుల నుండి వచ్చి చదువుకోనుచున్నామో వివరించారు.
అనంతరం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో బంగారు బాల్యం బాలోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్, లోగో, స్లొగన్స్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేసారు.
తొలుత చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సెలబ్రేషన్స్/బంగారు బాల్యం బాలోత్సవాలు ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులోని ఓల్డ్ గుంటూరు రోడ్డులో గల రవి ప్రియా మాల్ వద్ద నుండి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్.పి ఏ ఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్ధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అడిషనల్ ఏఎస్పీ నాగేశ్వర రావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, డిఆర్డిఎ., మెప్మా పిడీలు వసుంధర, రవి కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్వర రావు, బిసి కార్పొరేషన్ ఈడి వేంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.







