వెట్టిచాకిరి నుండి విడిపించడానికి ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

వెట్టిచాకిరి (బాండెడ్ లేబర్) నుండి విడిపించడంతోపాటు బాధితులకు అవసరమైన పునరావాసము, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపైనా సమానదృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఆమె అధ్యక్షతన జిల్లాస్థాయి బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ సమావేశం ప్రకాశం భవనంలో జరిగింది. 2014 తరువాత నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రకాశం జిల్లాలోనే ఈ కమిటీ నియామకం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలిసారి జరిగిన ఈ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహరహిత, బాల కార్మిక రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం “బంగారు బాల్యం” కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామన్నారు. బాల కార్మికులు లేకుండా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా బాండెడ్ లేబర్ పైనా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శ్రమదోపిడి, లైంగిక దోపిడీతోపాటు ఆర్థిక దోపిడీ కూడా ఈ వెట్టిచాకిరీలో ఉంటుందని ఆమె అన్నారు. కేవలం పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలతోనూ వెట్టిచాకిరీ చేయిస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం-1976 లోని నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈ దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వెట్టిచాకిరీ నుండి విడుదల పొందిన వారికి ప్రభుత్వ పధకాల ప్రయోజనాలను కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన ఆధార్, ఓటరు ఐ.డి., ఉపాధిహామీ పధకం జాబ్ కార్డ్, తదితర సర్టిఫికెట్లు కూడా వారికి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెట్టిచాకిరీ జరగకుండా చూడడంతోపాటు బాధితులకు చట్ట ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలు అందేలా చూడాలని, విముక్తి అనంతరం వారి జీవన స్థితిగతులను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 2047 నాటికి పేదరికంలేని ప్రకాశం జిల్లా అవిష్కృతమయ్యేలా తమ శాఖల పరిధిలోనూ, సమిష్టిగానూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అధికారులు కృషి చేయాలని కలెక్టర్శా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ దేవి, ఒంగోలు డి.ఎస్.పి. ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్.డి.ఓ. లక్ష్మీ ప్రసన్న, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, డి.ఈ.ఓ. కిరణ్ కుమార్,

డి.ఎస్.ఓ. పద్మశ్రీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, ఇన్ఛార్జి డి.ఎం.హెచ్.ఓ. పద్మజ, డి.ఆర్.డి.ఏ. పి.డి. వసుంధర, డి.సి.పి.ఓ. దినేష్ కుమార్ సి.డబ్ల్యు.సి. సభ్యురాలు నీలిమ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్. సునీల్ కుమార్ (సార్డ్స్), ప్రియాంక, శ్యామ్ (ఇంటర్నేషనల్ జెస్టిస్ మిషన్), ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *