ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారీయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఏ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలలో అయినా విద్యార్థులకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల ఫీజు చెల్లించకపోవడం వల్ల కొంతమంది డిగ్రీ, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం, వారిని పరీక్షలను రాయనీకపోవడం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఎలాంటి హోల్డ్ చేయకూడదని ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చిందని, ఎవరైనా కళాశాలల ప్రిన్సిపాల్స్ విద్యార్థుల సర్టిఫికెట్లను హోల్డ్ చేయడం చేస్తే సంబంధిత కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టడం, వారిపై జరిగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఫీజును కళాశాలల అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుందని జీవో ఇవ్వడం జరిగిందని, కళాశాలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. ఏ కళాశాలలోనూ విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులు పెట్టరాదని సూచించారు.
