లింగ ఆధారిత వివక్ష, హింస కేవలం మహిళల సమస్య మాత్రమే కాదని, ఇది ప్రతిఒక్కరినీ ప్రభావితం చేసే మానవ హక్కుల సమస్య అని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈవో శ్రీ జి. వీరపాండ్యన్ అన్నారు. జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం – నూతన చైతన్యం 3.0 (National Campaign Against Gender based Discrimination) మరియు 13 రాష్ట్రాల్లో 227 జెండర్ రిసోర్స్ సెంటర్స్ ను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడ, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 2వ అంతస్తులోని సెర్ప్ కార్యాలయం నుంచి జి. వీరపాండ్యన్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అనంతరం జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రచారం గోడ పత్రికలను ఆవిష్కరించి రాష్ట్రంలో నిర్వహించే జెండర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని వీరపాండ్యన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జి. వీరపాండ్యన్ మాట్లాడుతూ.. నూతన చైతన్యం 3.0 – మార్పు కోసం ముందడుగు, ఇక సహించం – గళం విప్పుతాం, హింసకు వ్యతిరేకంగా కలసికట్టుగా ఒకే స్వరం వంటి నినాదాలతో జెండర్ ఆధారిత హింసపై ప్రజలందరూ బాధ్యతతో పోరాటం చేయాలని అన్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు రాష్ట్రమంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి వారంలో ‘లింగ ఆధారిత హింసను అరికట్టే విధానం’ పై అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ కార్యక్రమం, రెండో వారంలో ‘ఆడపిల్లలకు విద్య’, మూడో వారంలో ‘బాల్య వివాహాలు’, నాలుగో వారంలో ‘గృహ హింస’ అనే అంశాలపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.
ఈ ప్రచారంలో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, వివిధ స్వచ్చంద సంస్థలు / సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లతో ఒక రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ ఏర్పాటు చేసుకుని వారితో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించి, ప్రణాళిక రూపొందించి అన్ని డిపార్ట్ మెంట్ ల ద్వారా జెండర్ ఆధారిత వివక్ష మీద ప్రచారం నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
అనంతరం.. జెండర్ అసమానతలు తొలగించే కార్యక్రమమును ఇంట్లో పిల్లల నుండే మొదలుపెట్టాలని, స్త్రీలను గౌరవించాలని, వారి హక్కులను పొందేందుకు సహాయం చేస్తామని, హింసకు వ్యతిరేకంగా మాట్లాడతామని పురుషులు చేయవలసిన జెండర్ ప్రతిజ్ఞను సిబ్బందితో స్వయంగా చేయించారు. లింగ ఆధారిత వివక్ష, హింసకు పాల్పడబోమని సెర్ప్ అదనపు ముఖ్య కార్య నిర్వహణాధికారి/ డైరెక్టర్, ఫైనాన్స్ జి. విజయ కుమారి స్త్రీలు చేయాల్సిన జెండర్ ప్రతిజ్ఞను సెర్ప్ సిబ్బందితో చేయించారు.
ఈ కార్యక్రమంలో పి. శ్రీనివాసులు, డైరెక్టర్- మానవాభివృద్ధి విభాగం, పి. సుశీల, డైరెక్టర్, పరిపాలన మరియు హెచ్ ఆర్, సెర్ప్, జి. పద్మావతి డైరెక్టర్, ఎం&ఈ మరియు జీవనోపాదులు, సెర్ప్, అడిషనల్ డైరెక్టర్లు, సెర్ప్ సిబ్బంది మరియు స్త్రీనిధి సిబ్బంది పాల్గొన్నారు.

