భారత దేశాన్ని భారతీయులే స్వతహాగా పరిపాలన చేసుకునే విధంగా తయారు చేయబడిన అత్యున్నతమైన వ్యవస్థే భారత రాజ్యాంగమని, ఆ రాజ్యాంగానికి ప్రపంచ దేశాలలో గౌరవ ప్రతిష్టలు పుష్కలంగా ఉన్నాయని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి అన్నారు. మంగళ వారం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సమావేశపు హాలులో నిర్వహించిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక లకు ప్రొఫెసర్ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజ మోహన్ రావు మాట్లాడుతూ…. రాజ్యాంగ రచనలో డాక్టర్ అంబేద్కర్ నిరంతరంగా శ్రమించారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ.కే.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా భారత వ్యవస్థను నిర్దేశించడం జరిగిందని అన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు భారత దేశంలో రాజుల పాలన ఉండేదని ఆ రోజుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో పరిపాలనా వ్యవస్థ అందుబాటులో ఉండేదని,స్వాతంత్ర్యానంతరం పరిపాలనా వ్యవహారంలో దేశంలో అన్ని వ్యవస్థలు కలిపి ప్రజా పరిపాలనను స్వతహాగా నిర్వహించు కోవడం కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆద్వర్యంలో అతి పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకూ అనేక దేశాల రాజ్యాంగ వ్యవస్థలు మార్పులకు గురైనప్పటికి భారత రాజ్యాంగంలో కేవలం సవరణలు మాత్రమే చోటు చేసు కున్నాయే తప్ప మార్పులు ఏమాత్రం జరగ లేదని ప్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ – 19 ప్రకారం ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన భావ ప్రకటనను చేపట్ట వచ్చునని అన్నారు. భారత రాజ్యాంగం గురించిన పలు విషయాలను వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి సభికులకు వివరించారు. ఏ.కే.యూ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి తన ప్రసంగంలో భారత రాజ్యాంగం గురించి వివరించారు. ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకున్న భారత రాజ్యాంగం రచనలో డాక్టర్ అంబేద్కర్ కృషి ప్రశంస నీయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు వక్తలు తమ ప్రసంగాలలో రాజ్యాంగ రచనలో భారత రత్న డాక్టర్ అంబేద్కర్ చేసిన శ్రమను కొనియాడారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకుడు కే.సాయి బాబు వందన సమర్పణతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. కార్యక్రమంలో సి.డి.సి డీన్ ప్రొఫెసర్ సోమ శేఖర, ఏ.సి.ఈ డాక్టర్ అంచుల భారతీ దేవి, ఎం.బి.ఏ విభాగం హెచ్.ఓ.డి డాక్టర్ బి పద్మజ, ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి డాక్టర్ ఆర్, శ్రీనివాస్ తో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

