అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ, ఆయన ఆదర్శాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ, ఆయన ఆదర్శాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్దంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ” ఆత్మార్పణ దినం ” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పర్యాటకాభివృద్ది సంస్ద ఛైర్మన్ నూకసాని బాలాజీ, పలు సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో ” ఆత్మార్పణ సభ ” నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ……..పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైందన్నారు. రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా దళితులకు దేవాలయ ప్రవేశం కోసం, స్వాతంత్ర్య పోరాటంలో కూడా పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు స్పూర్తిదాయకమన్నారు. ప్రకాశం జిల్లాతో కూడా పొట్టి శ్రీరాములుకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు, అభివృద్ధి ఉండాలన్న
పొట్టి శ్రీరాములు ఆశయ సాధన దిశగా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ………. స్వాతంత్ర్య సమరంలో పొట్టి శ్రీరాములు నిస్వార్థ పోరాటయోధునిగా గాంధీజీ నుంచి ప్రశంసలు అందుకున్నారని అన్నారు. కుటుంబ సమస్యలు వేధిస్తున్నా స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారని, అంతేకాకుండా దేశ స్వాతంత్ర్యంతో పాటే దళితులకు ఆర్థిక , సామాజిక స్వేచ్ఛ కూడా రావాలని అప్పట్లోనే పొట్టి శ్రీరాములు అభ్యుదయ భావంతో ఆలోచించి దళితులకు ఆలయ ప్రవేశం దిశగా కృషి చేశారని కొనియాడారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలంటూ ఆయన చేసిన కృషితోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అదే పునాదిగా దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ముందుకి తీసుకువెళ్లి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
చెందేలా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంటును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
నూకసాని బాలాజీ మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ వ్యక్తి శ్రీ.పొట్టి శ్రీరాములు అని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన గుర్తుంటారని అన్నారు. పొట్టి శ్రీరాములు సేవలు, త్యాగాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమాలలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అంజల, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డీఈవో కిరణ్ కుమార్, స్టెప్ సి.ఈ. ఓ. శ్రీమన్నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *