గిరిజనుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం ఒంగోలులోని రహదారులు మరియు భవనాల శాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో గిరిజనులు మరియు గిరిజన సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నివాస స్థలాలు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి ప్రామాణికమైన ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఒంగోలులోని మున్సిపల్ వాణిజ్య సముదాయంలో గిరిజనులకు హక్కు మేరకు దుకాణాలు కేటాయించేలా చూడాలని ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ సభ్యుడిని గిరిజనులు కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు.
గిరిజనులు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను అనంతరం ఆయన మీడియాకు వివరించారు. ఒంగోలు మండల శివారులో కొత్తపట్నం వెళ్లే రోడ్డులో 55 గిరిజన కుటుంబాలకు ( నక్కల తెగ వారికి ) కేటాయించిన ఇళ్ల స్థలాలు నివాసయోగ్యంగా లేవని, లోతట్టు ప్రాంతం కావడం వలన వర్షాలకు గుడిసెలు మునిగిపోయాయని తెలిపారు. ఈ స్థలాన్ని నివాస యోగ్యంగా మార్చేందుకు లేదా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు 15 రోజుల్లోగా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు. కొత్తపట్నం ప్రాంతంలో ఉంటున్న గిరిజనులు చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారని , వీరికి కూడా ఇతర మత్స్యకారులకు ఇచ్చినట్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన కోరారు. ఈ గుర్తింపు కార్డులు లేకపోవడం వలన ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలను గిరిజనులు పొందలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని గిరిజన కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మున్సిపల్ వాణిజ్య దుకాణాల్లో గిరిజనులకు హక్కు మేరకు కేటాయింపులు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు సూచించారు. ఆయా అంశాలపై అప్పటికప్పుడే కమిషనర్ తోనూ, ఒంగోలు తహసీల్దారు తోనూ మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసే నిధులను ఎస్టీ జనాభాను బట్టి తగిన నిష్పత్తిలో ఆ వర్గం వారి ప్రయోజనాల కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమస్యలపై ప్రత్యక్షంగా తానే వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకుంటానని కమిషనర్ చెప్పినట్లు శంకర్ నాయక్ తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, గిరిజన సంఘాల నాయకులు పేరం సత్యం, సైదా నాయక్, గంటా సుబ్బారావు, డాక్టర్ బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు .