విద్యుత్ వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం ఒంగోలులోని విద్యుత్ భవనం నుండి ప్రకాశం భవనం వరకూ విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మీడియాతో మాట్లాడుతూ……… ప్రజల్లో విద్యుత్ వినియోగం పై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు విద్యుత్ వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించుటకు ర్యాలీను నిర్వహించడంతో పాటు, ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు తెలిపారు. ఏ రంగమైనా అభివృద్ది చెందాలంటే విద్యుత్ అవసరమన్నారు. నేడు సమాజంలో విద్యుత్ అవసరాలను దృష్టి లో వుంచుకుని విద్యుత్ ను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని, ప్రజలు విద్యుత్ వినియోగం పై అవగాహన చేసుకుని ఎల్ఈడి బల్బులు, స్టార్ రేటెడ్ ఉపకరణాలు వినియోగిస్తూ విద్యుత్ ను అదా చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రజలకు సూచించారు.
ఈ ర్యాలీ లో ఎపిసిపిడిసిఎల్ ఎస్.ఈ వెంకటేశ్వర రావు, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.


