రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, పాకలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుచున్న 68వ రాష్ట్రస్థాయి అండర్ 17,18,19 బాల బాలికల క్యారమ్స్ పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి క్రీడా జ్యోతి ని వెలిగించి క్రీడలను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. …. విద్యార్థులు చదువు తోపాటు క్రీడల్లో పాల్గొన్నపుడే వారి మనో వికాసం, మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం పెంపొందింపబడుతుందన్నారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణ వలన వివిధ ప్రాంతాలనుండి వచ్చిన క్రీడాకారులు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో పాటు స్నేహ సంబంధాలు ఏర్పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతి రాజధానిలో గొప్ప క్రీడా స్టేడియంలను నిర్మించబోతున్నట్లు మంత్రి తెలిపారు. 2014-19 సంవత్సరాల కాలంలో కొండపి, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంల నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వ హయాంలో ఆ నిర్మాణాలు ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సాంఘీక సంక్షేమ శాఖ లో ఏడు సంవత్సరాల నుండి ఆగిపోయిన స్పోర్ట్స్ మీట్ ను మరలా ప్రారంభిస్తామని దానికి కోటి రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సింగరాయకొండలో 95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దివ్యాంగుల కొరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నం లో 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో క్రీడా స్టేడియం ను నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గెలుపు ఓటములు సర్వ సాధారణమైన విషయమని, క్రీడా స్ఫూర్తి గొప్పదని మంత్రి అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు. క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించి, ఉన్నత విద్యను అభ్యసించి స్పోర్ట్స్ కోటాలో చదువులోగాని, ఉపాధి లో గాని మంచి అవకాశాలు పొందాలని మంత్రి తెలిపారు. క్రీడలను పాకల లో ఏర్పాటుచేయడం పట్ల విద్యా శాఖ అధికారులను, నిర్వాహకులను, దాతలను ప్రత్యేకంగా మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
క్యారమ్స్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 400 క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ గేమ్స్ పరిశీలకులు స్వర్ణ రాజు, పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి శ్రీమతి డి హజీరా బేగం, ఎం ఈఓ శ్రీనివాస రావు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



