దర్శి నియోజకవర్గంలో ముండ్లమూరు, తాళ్లూరు మండలాలలో స్వల్ప భూ ప్రకంపనలు చూస్తున్నాం .. … దీనిపై దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం దర్శి లోని నివాసం లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముండ్లమూరు మండల ఇంచార్జ్ ఎమ్మార్వో డిటి శ్రీకాంత్ తక్షణమే ఈ భూ ప్రకంపనలపై నివేదిక ఇవ్వాలని ఆమె కోరారు. డాక్టర్ లక్ష్మి తో పాటు దర్శి డిఎస్పి లక్ష్మీ నారాయణ , సీఐ రామారావు , తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు తదితర అధికార బృందంతో ప్రకంపనల పై చర్చించారు. అధికారులతో కలిసి నేషనల్ జియోగ్రాఫిక్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులతో ఫోను ద్వారా డాక్టర్ లక్ష్మీ సంప్రదింపులు జరిపారు. జరుగుతున్న ప్రకంపనల తీవ్రతను అధికారులకు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తో కూడా తీవ్రతపై డాక్టర్ లక్ష్మి మాట్లాడారు స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు కూడా తెలిపారు. దీనిపై నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ సెంటర్ అధికారులు స్పందిస్తూ రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని తెలిపారు. ఎందుకు ఇలా ప్రకంపనలు జరుగుతున్నాయి అన్న విషయంపై లోతైన సమీక్ష జరుగుతుందన్నారు. ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని దీనిపై తీవ్రంగా పరిగణించి రీసర్చ్ చేస్తున్నామన్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న ప్రకంపనలకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణంలో మార్పులు వల్ల ఇలాంటి వస్తుంటాయని ప్రజలు భయపడాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు . దీనిపై డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు తుఫాను వాతావరణంలో మార్పులతో సముద్రంలో అలల ప్రభావం వల్ల ఇలాంటి ప్రకంపనలు సహజమని అయినా జియోగ్రఫీ అధికారులు చర్చించామని జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని ప్రజలు ఎవరు భయపడాల్సిన పనిలేదని ఆమె వివరించారు. ఈ కార్యక్రమం లో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
