ప్రత్యేకమైన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన మేధావి, ప్రగతి కాముకుడు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి అఖండ భారతావనికి తీరని లోటని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి అన్నారు.మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా శుక్రవారం సాయింత్రం 4.45 గంటలకు స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సమావేశపు హాలు నందు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు అధ్యక్షత వహించారు. సంతాప సమావేశానికి ముందు దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి,సిడీసి డీన్ ప్రొఫెసర్ సోమ శేఖర తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అఖండ భారతావని గర్వించ దగిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి ప్రజల అభ్యుదయానికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.1991 వ సంవత్సరం కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విశ్వ విద్యాలయాలలో పని చేస్తున్న టీచింగ్ స్టాఫ్ కు రివైజ్డ్ స్కేల్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక ప్రత్యేక సంస్కరణలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కు తుందని వి.సి ప్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. అంతే కాకుండా దివంగత మహానేత,ఆర్థికవేత్త గా ప్రపంచ దేశాలతో కీర్తింప బడిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గానే కాకుండా ప్రధానిగా భారతావనికి రెండు పర్యాయాలు ప్రధానిగా పదేళ్లు పని చేశారని,ఆ సమయం లోనే భారతావనిలో పుట్టి పెరిగిన ప్రతి పౌరునికి ఆధార్, అభివృద్ధి తో బాటు వలస లను నివారించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం,ఆర్టిఐ వంటి అనేక చట్టాలు రూపు దిద్దుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అదే విధంగా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు పలువురు వక్తలు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో ఎం.బి.ఏ విభాగం హెడ్ డాక్టర్ బి పద్మజ,ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ. దేవీ వర ప్రసాద్, సోషల్ వర్క్ విభాగం హెడ్ డాక్టర్ పిల్లి.వెంకట రావు, ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి డాక్టర్ ఆర్.శ్రీనివాస్ తోబాటు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
