చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ వసతి గృహాల్లో రూ. 143 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సి బాలురు, బీసీ బాలురు, బాలికల వసతి గృహాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహాల్లోని వంట గదులు, పరిసరాలు పరిశీలించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా… ఆయన మాట్లాడుతూ….కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు మహర్దశ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నాం. హాస్టళ్ల మరమ్మతులకు ప్రతి జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాం. రూ.206 కోట్లతో 62 నూతన హాస్టళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. భీమ్ ప్రాజెక్టుతో గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నాం. విద్యార్థుల రోజు వారీ ఆరోగ్య పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక డాక్టర్ ని నియమించాం.గురుకులాల్లో 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్ లు అందుబాటులోకి తెస్తున్నాం. అనారోగ్యానికి గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న 10 మందికిపైగా విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.





