పేదల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం పొన్నలూరు మండలం సుంకిరెడ్డి పాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు మంత్రివర్యులు ఫించన్ నగదును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల మేరకు గతంలో 3వేల రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ని 4వేల రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ముందుగానే 63 లక్షల మందికి రెండువేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి నెలా ఖచ్చితంగా1వ తేదీనే పెన్షన్ లు పంపిణీ చేస్తున్నామని, 1వ తేదీన ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్లు పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గతంలో భర్త చనిపోతే వితంతు పెన్షన్ పొందడానికి ఆరు నెలల సమయం పెట్టేదని, అలాకాకుండా భర్త చనిపొయిన నెలలోనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే అమలు చేస్తునట్లు అయన చెప్పారు. ఈ నెలలో కొత్తగా 5402 మహిళలకు వితంతు పెన్షన్లు మంజూరు చేసి ఇస్తునట్లు అయన తెలిపారు. ఎవరైనా వలసలు వెళ్ళి రాలేని స్థితిలో ఉన్న వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
సుంకిరెడ్డి పాలెంలో 2014-19 కాలంలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులను గత ప్రభుత్వం నిలిపివేసిందని, వాటిని ప్రస్తుతం తామే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. స్వంత ఇళ్ళు లేనివారికి తక్షణమే వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేసించినట్లు తెలిపారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పధకాలను పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందిస్తామని, పేదల సేవలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.
కార్యక్రమంలో కనిగిరి ఆర్.డి.ఓ. కేశవర్ధస్ రెడ్డి, డి.ఆర్.డి.ఏ. పి.డి. రవి కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మా నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి, ఎంపిడిఓ నాగేశ్వర రావు. తహసిల్దార్ పుల్లారావు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




