మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి అని పిలుస్తారని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారుఢుడై ముక్కోటి దేవతలతో భక్తజన రక్షణకు, శీఘ్రగతిన వారికి తమ దర్శన భాగ్యాన్ని కల్పించుటకు భూమి మీదకు వచ్చారని ప్రతీతి. సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే సందర్భంగా ముందు వచ్చే ఏకాదశి ఎంతో పవిత్రమైనదని, స్వామి వారు ఉత్తర ద్వారమున భక్తుల రాక కొరకై, వారిని అనుగ్రహించడానికి వేచి చూస్తారని, ఉత్తర ద్వారమున స్వామివారిని దర్శించుకుంటే సద్గతులు లభిస్తాయన్న హిందువుల భావన. స్వామివారిని దర్శించుకొనుటకు ప్రాతఃకాలంనే నిద్రలేచి కాల కృత్యాలు తీర్చుకొని కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉన్నది.
ఈ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం ఒంగోలు నగరంలోని ఆలయాలన్నిటిని శాస్రోక్తంగా శుద్ధిచేసి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఉత్తర ద్వారమున కొలువుదీర్చి స్వామివారి దర్శనార్థం విచ్చే భక్తులకు అనంతమైన స్వామివారి కృప లభించేలా ఆలయ నిర్వహణ అధికారులు తగు కృషి చేశారు.
ప్రాతః కాలమునే భక్తులు వేలాదిగా స్వామివారి దర్శనార్థం ఆలయాలకు చేరుకొని, స్వామివారి నామస్మరణతో… స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందారు.
స్థానిక కేశవ స్వామి పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, విజయ దుర్గాదేవి ఆలయం, వీరాంజనేయ స్వామి దేవస్థానం, సీతారాంపురం లోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం, శ్రీ వరాల నాగేంద్ర స్వామి దేవస్థానం, అమలనాధుని వారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన లో హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామ చంద్ర స్వామి, శ్రీగిరిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొత్తపట్నం బస్టాండ్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలలో స్వామి వారు ఆలయమునకు విచ్చేసిన భక్తులను మహాద్వారం వద్దనే అనుగ్రహించారు. భక్తులకు ఉత్తర ద్వారము వద్ద స్వామి దర్శన ప్రాప్తికి కి మధ్యాహ్నం 12 వరకు ఆలయాలను తెరచి ఉంచారు.
ఆలయంలో వద్ద భక్తుల రద్దీని అదుపు చేయుటకు ఆలయ కమిటీలు, పోలీస్ శాఖ, మున్సిపల్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని శీఘ్రగతిన స్వామివారి దర్శనం భక్తులకు లభించేలా ప్రత్యేకమైన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వాహకులు శీఘ్రదర్శనం పేరిట రుసుముతో కూడిన ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.







