మాఘశుద్ధ పౌర్ణమి ఎంతో పవిత్రమైనదని, మాఘ పౌర్ణమి నాడు వెన్నెల్లో విష్ణు సహస్రనామం జపించడం, నదీ స్నానాలు ఆచరించడం ఎంతో శ్రేష్టమైనవని పౌర్ణమితిథి శ్రీగిరి స్కందగిరి గిరి ప్రదక్షిణ సేవా సమితి నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి తెలిపారు.
పౌర్ణమి సందర్భంగా ప్రతి మాసంలో నిర్వహించే పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల బాపూజీ గోశాల వద్ద నుండి సుందరంగా అలంకరించిన శేష వాహనం పై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను కొలువుదిర్చి… అఖండ దీపం దారిచూపగా… మంగళవాయిద్యములు మ్రోగుచుండగా స్వామి వారి రథము స్థానిక కోర్టు సెంటర్ మీదుగా కేశవస్వామి పేట, భగీరథ మహర్షి మందిరం ముందుగా… వేప అంకమ్మతల్లి దేవాలయం, గద్దలగుంట మీదుగా శ్రీగిరి అనంతరం స్కందగిరి చేరి స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణలో భాగంగా తమ గృహాల వద్దకు వచ్చిన స్వామివారి ఉత్సవమూర్తులకు భక్తులు హారతులు ఇచ్చి నీరాజనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కార్యక్రమంలో పాల్గొని గోవింద నామాలు చదువుతూ శ్రీగిరి ప్రాంతమును ఆధ్యాత్మిక భక్తి ద్విగుణీకృతం చేశారు.

