ఇంకుడు గుంతల నిర్మాణాన్ని లక్ష్యం మేరకు చేపట్టడంపై తక్షణమే దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవనం నుంచి ఎంపీడీవోలు , మున్సిపల్ కమిషనర్లు, ఏ.పి.ఓ.లు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రతినెల మూడో శనివారం ‘ స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర ‘ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన జిల్లాలో సుమారు 15 వేల ఇంకుడుగుంతలు నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. వీటి నిర్మాణ పరిమాణం, ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, తదితర అంశాలను ఆమె వివరించారు. ఆయా విషయాలను లబ్ధిదారులకు తెలిపి, నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని రెండు రోజుల్లో సమకూర్చుకొని, శనివారం జిల్లావ్యాప్తంగా ఈ పనులు ప్రారంభమయ్యేలా పర్యవేక్షించాలని డ్వామా అధికారులను ఆదేశించారు.
తడిచెత్త, పొడిచెత్త , ప్రమాదకర వ్యర్థాలను ఇంటివద్దే వేరు చేసేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే నిర్మించిన ‘ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రా’లు అన్నింటినీ ఈనెల 15వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్మాణంలో ఆగిపోయిన వాటిని పూర్తి చేయటంపైనా దృష్టి సారించాలన్నారు.
బాల్య వివాహాలు, పోషకాహార లోపాలను నివారించడం కోసం ‘బంగారు బాల్యం’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన సర్వేను వెల్ఫేర్ అసిస్టెంట్లు, గ్రామ , వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, డీ.పి.ఓ. గొట్టిపాటి వెంకట నాయుడు , జెడ్పి సిఈఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


