పేద విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని, విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు బాపట్ల జిల్లా రేపల్లెలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రతపై ప్రిన్సిపల్ పై మంత్రి డోలా అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలసి నేలపై కూర్చుని ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందన్నారు. మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు గమనించాలని, కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.


