సీ.వి.ఎన్ రీడింగ్ రూమ్ మరియు క్లబ్ పీఠం ఎవరిది?

134 సంవత్సరాలు చరిత్ర కలిగిన సి.వి.ఎన్ రీడింగ్ రూమ్ మరియు క్లబ్ ఎందరో సాహితీవేత్తలకు, కళాకారులకు అటు ఆధ్యాత్మిక ఇటు కమ్యూనిస్టు భావజాల కార్యక్రమాలకు వేదికైనటువంటి మరియు ఎందరినో సినీ కళాకారులుగా మార్చిన కళావేదిక, మరి ఎందరినో గాయకులుగా సమాజానికి పరిచయం చేసిన సివిఎన్ రీడింగ్ రూమ్.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలినాళ్లలో స్వాతంత్రోద్యమ సమయములో దేశ స్వాతంత్ర్యం కోసం ఉత్సాహవంతులందరూ ఒకచోట చేరి ఉద్యమ కార్యక్రమాల చర్చలు జరపడానికి 1891 వ సంవత్సరంలో కొప్పరపు వెంకన్న నిలయం పేరుతో ఒక చిన్న అద్దె గదిలో ఏర్పాటుచేసి నాడు మేధావులందరూ బ్రిటిష్ పాలకుల చర్యలకు వ్యతిరేకంగా స్వాతంత్ర సాధనకు చేయాల్సిన కార్యక్రమ నిర్వహణ కొరకు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడానికి సివిన్ రీడింగ్ రూమ్ ఎంతో ఉపయోగపడింది.
నాడు వారణాసి సుబ్రహ్మణ్యం పంతులు జిల్లా మునిసిఫ్ పదవిలో వుండి, ఈ రీడింగు రూమ్ నిర్వహణకు సహకరించారు. 1891వ సం॥ము మార్చి నుండి అద్దె భవనంలో రీడింగ్ రూమ్ & లైబ్రరీ నడుపబడుచున్న తరుణంలో త్వరితగతిన బాగా ప్రజాదరణ పొంది స్వంత భవన నిర్మాణమునకై ప్రయత్నం జరిగినది. ఆ సమయములో దివాన్ బహదూరు కామరాజు మన్నారు క్రిష్ణారావు పంతులు రీడింగు రూము సెక్రటరీగా ఉంటూ, మే 1898లో కొప్పరపు రామారావు పంతులని కలసి సదరు భవన నిర్మాణము కొరకు, ధన సహాయము చేయమని అర్ధించిరి. రామారావు పంతులు అందుకు అంగీకరించిరి. అప్పటి కార్యదర్శి క్రిష్ణారావు పంతులు అప్పటి, ఒంగోలు సబ్ కలెక్టర్గారైన “మాసివర్ ఐ.సి.యస్” భవన నిర్మాణమునకు స్థలమును కేటాయించమని అర్ధించిరి. కార్యదర్శి విజ్ఞప్తిని మన్నించి సబ్ కలెక్టరు స్థల నిర్ణయము రీడింగ్ రూమునకు దాఖలపరిచే ప్రయత్నము మొదలెట్టిరి. వారి తరువాత వచ్చిన సబ్ కలెక్టరు గోష్ ఇప్పుడు మనము అనుభవిస్తున్న రీడింగు స్థలమును కార్యదర్శి పేరుతో అసైను చేసిరి. వెంటనే రామారావు పంతులుగారిచ్చిన విరాళము రూ. 2,000లతో భవనము నిర్మించబడి ఏప్రియల్ 1వ తేది, 1900 సం||లో రీడింగ్ రూము మరియు లైబ్రరీ స్వంత భవనము లోనికి తరలించబడినది. ఆనాడు, యావత్ ఒంగోలు పట్టణములోనే ప్రజలు పండుగ జరుపుకొని పైన ఉదహరించిన రీడింగ్ రూము అండ్ లైబ్రరీకి కొప్పరపు వెంకన్న నిలయం రీడింగ్ రూము మరియు లైబ్రరీ అని నామకరణము చేసిరి. 1913 జనవరి 3వ తేదీన సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్టు రి.186డి రిజిస్టరు కాబడినది. తదుపరి క్రీడాకారులకు అవకాశములు కల్పించే నిమిత్తం ఒక మినీ బిలియర్డ్స్ టేబుల్ నొకదానిని వరదా శ్రీరాములు నాయుడు, మల్లవరపు సుబ్బారావు, మైనంపాటి నరసింహంల ధన సహాయంతో నెలకొల్పారు. ఈ బిలియర్డ్స్న టేబుల్ ఆటకు కావలసిన భవనాన్ని స్వర్గీయ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గురువు గారైన ఇమ్మనేని హనుమంతరావు నాయుడుగారి జ్ఞాపకార్ధం దానం చేసి 1920 సంవత్సరం క్లబ్బుకు ప్రెసిడెంటుగా బాధ్యతలు నిర్వహించియున్నారు. ఈ భవనం స్వర్గీయ ధారా గోపాలశాస్త్రి దగ్గరుండి పూర్తి చేశారు. ఈ ప్రతిష్ఠాకరమైన బిలియర్డ్స్ యావత్ ఆంధ్రదేశములో ఏ ఒకటి రెండు చోట్ల లేనిరోజుల్లో ఒంగోలులో మార్చి 1938లో నిర్మించబడి సి.వి.యన్. రీడింగ్ రూమ్ & లైబ్రరీ ప్రతిష్ఠాత్మకమైన స్థానమును పొందినది.

కాలానుగుణంగా సివిఎన్ రీడింగ్ రూమ్ కళలకు కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా కళావేదిక నిర్మాణం తో పాటుగా టేబుల్ టెన్నిస్, క్యారం బోర్డ్, చదరంగం, షటిల్, మరియు కరాటే తదితర ఆటలకు సంబంధించిన క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయడం. తద్వారా సభ్యులు పెద్ద సంఖ్యలో చేరడంతో రాజకీయ, సాహిత్య గోస్టులకు వేదికగా సివిల్ రీడింగ్ రూమ్ మారడం, జీవితకాల సభ్యత్వంతో సభ్యులను చేర్చుకోవడం క్లబ్ మరియు రీడింగ్ రూమ్ నిర్వహణకు రెండు సంవత్సరాల కాల వ్యవధితో 11 మందితో కమిటీని ఏర్పాటు చేయడం ఎప్పటికప్పుడు గడువులో ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది.

ప్రస్తుతం 970 మంది సభ్యులు గల సి వి ఎన్ రీడింగ్ రూమ్ నిర్వహణకు 2025 – 27 సంవత్సరాలకుగాను ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల సందడి రీడింగ్ రూమ్ సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. ఎంతో పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల సరళి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి అభ్యర్ధులుగా నలుగురు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, కార్యదర్శి అభ్యర్థులుగా ముగ్గురు, సహకార్యదర్శులుగా ఇద్దరు, కోశాధికార పదవికి అభ్యర్ధులుగా ఆరుగురు, కార్యనిర్వాహక సభ్యులుగా 12 మంది నామినేషన్ విరమణ తరువాత పోటీలో మిగిలారు.

సివిఎన్ పీఠం ఎవరిది??!

మార్చి 9వ తేది ఆదివారం ఉదయం 8 నుండి మధ్యహాన్నం 3 గం.లవరకు జరిగే ఎన్నికలలో ముఖ్యంగా మహాత్మా గాంధీ ప్యానెల్, ఆంధ్ర కేసరి ప్రకాశం ప్యానెల్ గా రెండు గ్రూపులు ప్రధానంగా పోటీపడుతున్నాయి. మరి ఇద్దరూ ఇండిపెండెంట్ అధ్యక్ష పదవికి అభ్యర్థులుగా నిలబడ్డారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో అని సభ్యులతో పాటుగా ఒంగోలు నగరంలోని అధికార, అనధికారులు, సాహిత్య సంఘాల వారు గాయక గాయనీమణులు తదితర కళా పోషక వేత్తలు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాలకతీతంగా వర్ణ వర్గ భేదాలను పక్కనపెట్టి రెండు ప్యానెల్స్ వారు తమ కమిటీలో అందరికీ సమాన ప్రతిపత్తిని కల్ఫించారు. బ్యాలెట్ పత్రం ద్వారా జరిగే ఓటింగ్ లో ప్యానల్ ప్రకారం అభ్యర్ధులు నిలుచున్నప్పటికీ ఓటర్లు మాత్రం తమకు నచ్చిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేసుకుంటారు. ఆ వచ్చిన ఓటింగ్ లో అధిక శాతం ఓట్లు పొందిన వారు సివిఎన్ రీడింగ్ రూమ్ మరియు క్లబ్ బాధ్యతలను స్వీకరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *