సనత్ నగర్ మార్చ్ 8 (జె ఎస్ డి ఎం న్యూస్) : శ్రీ విద్య చదువుకి అన్ని విధాలుగా అండగా ఉంటా నని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సనత్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన అశోక్, మమత దంపతుల కూతురు శ్రీ విద్య కు ఆధార్ కార్డ్ లేదని స్కూల్ లో చేర్చుకోవడం లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే స్పందించి ఆధార్ కార్డ్ కు అవసరమైన సర్టిఫికెట్ ఇప్పించేందుకు కృషి చేస్తానని శ్రీ విద్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఆ వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో జీ హెచ్ ఎం సి అధికారులు దాసారం బస్తీలోని శ్రీ విద్య ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించి ఆధార్ కార్డ్ మంజూరు కు అవసరమైన సర్టిఫికెట్ ( నాన్ అవైలబులిటీ) జారీ చేశారు. శనివారం శ్రీ విద్య తల్లి మమత వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయానికి సనత్ నగర్ కు చెందిన బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి చేరుకోగా, ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీ విద్యకు సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని, ఏ అవసరమున్నా తానున్నానని ధైర్యం చెప్పారు. వెంటనే స్పందించి తమ కూతురుకు సర్టిఫికెట్ మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యే కు మమత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, శేఖర్, రాజేష్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
