జర్నలిస్టుల అక్రెడిటేషన్ నూతన విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన శనివారం జరిగింది.
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ మంజూరు విషయంలో జరుగుతున్న జాప్యంపై కార్యవర్గంలో చర్చ జరిగింది. పలు జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయలేదని, చివరికి అడ్డగోలు నిబంధనలతో జీవో జారీ చేసి , అర్హులైన సగం మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ నిరాకరించారని, జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. అర్హులందరికీ అక్రెడిటేషన్ మంజూరయ్యేలా నూతన విధానాన్ని రూపొందించాలని వారు కోరారు. వెంటనే నూతన అక్రెడిటేషన్ విధానాన్ని ప్రకటించాలని కోరుతూ ఏప్రిల్ 7 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కార్యవర్గం జిల్లా శాఖలకు పిలుపు ఇచ్చింది.
శాసనసభ సమావేశాల కవరేజీకి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు అవకాశం ఇవ్వకపోవడం సమంజసం కాదని , అన్ని సంస్థలకు అవకాశం కల్పించాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఎ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజ్ఞప్తి చేసింది. శాసనసభలో మీడియా సలహా కమిటీ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ చివరివారంలో ఒంగోలులో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.అధ్యక్షత వహించిన ఐ.వి సుబ్బారావు మాట్లాడుతూ అక్రిడిటేషన్ల కోసం ఇప్పటివరకూ యూనియన్ నాయకత్వం చేసిన కృషిని వివరించారు. అక్రెడిటేషన్ల రెండో విడత పొడిగింపులో సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు.అక్రెడిటేషన్ గడు వులు పొడిగింపుల వల్ల వందలాదిమంది కొత్త జర్నలిస్టులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలో పాల్గొన్న పలువురు సభ్యులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని సూచించారు. ఆ సూచన మేరకు ఏప్రిల్ 7 వ తేదీన రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయడానికి సమావేశం తీర్మానించింది. వివిధ జిల్లాలనుంచి వచ్చిన ప్రతినిధులు వారి జిల్లాల సమస్యలను వివరించారు.
రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారి డి. సోమసుందర్ కార్యవర్గానికి నివేదించారు.
రాష్ట్ర కౌన్సిల్ లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఆయా జిల్లా కమిటీలు సిఫార్సు చేసిన వారిని ఆమోదించే అధికారం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అప్పగిస్తూ సమావేశం తీర్మానించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి యూనియన్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు స్పందిస్తూ, ముందుగా ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఇటీవల క్యూబా రాజధాని హవానా లోని హవానా యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ మీడియా సెమినార్ ఆహ్వానం మేరకు మన దేశ జర్నలిస్టుల తరుపున హాజరైన ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డిని అభినందిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. యూనియన్ రాష్ట్ర మహాసభల్లోనే అనుబంధ సంఘాల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, జాతీయ కార్యవర్గసభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, డాక్టర్ ఎం. ప్రసాద్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కే జయరాజ్, కార్యదర్శి డి.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ జిల్లా అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి.అక్కులప్ప, రాష్ట్ర కార్యదర్శులు ఎ .జయప్రకాశ్, ఎం. శ్రీరామమూర్తి, పీ.వీ.ఎస్.వి. శివప్రసాదరావు , పి. రామసుబ్బారెడ్డి కోశాధికారి ఎ.వి.శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.



