ప్రకాశం జిల్లా లోని
పిసి పల్లి మండలం, దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి ఈ నెల 2న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధులు అనంత్ అంబానీ తదితరులు వస్తున్న నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, స్థానిక శాసనసభ్యులు డా. ఉగ్ర నరసింహ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లతో కలిసి సభా వేదిక వద్ద జిల్లా అధికారులతో సమావేశమై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లు పై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి విచ్చేయుచున్న నేపథ్యంలో సదరు కార్యక్రమానికి సంబంధించి కేటాయించిన విధులను తూచాతప్పకుండా పాటిస్తూ అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, సభాస్థలంలో డయాస్, బ్యారికేడింగ్, విఐపి మరియు జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్న వివిఐపి లకు, విఐపి లకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తొలుత జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, స్థానిక శాసనసభ్యులు డా. ఉగ్ర నరసింహ రెడ్డి తో కలసి హెలిప్యాడ్, బ్యారికేడింగ్, పార్కింగ్, సభా వేదిక, సీటింగ్ ఏర్పాట్లు తదితర ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, కనిగిరి ఆర్డీఓ కేవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.





